- 22 ఏ పేరిట దోచుకున్న అక్రమ ఆస్తులను వదిలిపెట్టం
- సిట్ ద్వారా ముక్కు పిండి వసూలు చేస్తామని కామెంట్
ఖమ్మం, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన భూ భారతి చట్టం అమలే వచ్చే ఎన్నికల్లో తమ ప్రభుత్వ పనితీరుకు రెఫరెండమ్ అని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. చట్టం తెచ్చిననాడే ఈ మాట చెప్పామని, ఇప్పటికీ అదే మాట మీద నిలబడ్తున్నామని అన్నారు. గురువారం సత్తుపల్లి మండలం నారాయణపురంలో భూముల రీసర్వేపై అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ‘భూమి అనేది కేవలం మట్టి కాదు.. అది రైతన్నకు గుండెకాయ.. వారికి భూమితో ఎమోషనల్ బాండింగ్ఉంటుంది.
గత ప్రభుత్వ హయాంలో ధరణి పేరిట అవకతవకలు జరిగాయి. పేద రైతులకు పాస్ పుస్తకాలు రాలేదు. బోగస్ వ్యక్తుల పేరిట పదుల ఎకరాల రికార్డులు సృష్టించి రైతుబంధు సొమ్ము దోచుకున్నారు’ అని విమర్శించారు. పైలెట్ ప్రాజెక్ట్‌గా నాగార్జునసాగర్‌లో సర్వే చేయగా వేలాది ఎకరాల బోగస్ భూములు బయటపడ్డాయని అన్నారు. దాంతో రాష్ట్రవ్యాప్తంగా శాస్త్రీయమైన రోవర్ టెక్నాలజీతో సర్వే చేస్తున్నామని చెప్పారు. ప్రతి జిల్లాలో తొలి విడతగా 70 గ్రామాల్లో ఏడాదిన్నర వ్యవధిలో వ్యవసాయ భూములతో పాటు ఆబాదీ భూముల సర్వే చేస్తామన్నారు. ప్రతి రైతుకూ డిజిటల్ కోఆర్డినేషన్ మ్యాప్‌తో కూడిన టైటిల్ డీడ్ ఇస్తామని మంత్రి స్పష్టం చేశారు.
22ఏ అక్రమాలపై సిట్..
ప్రతిపక్షాలు 22ఏ కు సంబంధించి కారుకూతలు కూస్తున్నాయని పొంగులేటి విమర్శించారు. పార్టీల రంగులు వేరైనా బీఆర్ఎస్, బీజేపీ నేతలు ఒకటే స్క్రిప్ట్ చదువుతున్నారని అన్నారు. తమకు పిచ్చి మాటలకు, కారుకూతలకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదని, కేవలం రైతులకు, ప్రజలకే జవాబుదారీగా ఉంటామని అన్నారు.
కొంతమంది ఆక్రమణదారులు అమాయకులను అడ్డుపెట్టుకుని భూములను క్రమబద్ధీకరించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, వాటిని అనుమతించబోమని స్పష్టం చేశారు. 22ఏ భూముల క్రమబద్ధీకరణ అంశంపై ఇప్పటికే సిట్ వేశామని, అక్రమార్కులు పొందిన భూములను ముక్కు పిండి వసూలు చేస్తామని హెచ్చరించారు. తాను ప్రతి జిల్లాకు స్వయంగా వెళ్లి రైతులతో మాట్లాడి అక్కడికక్కడే సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర తదితరులు పాల్గొన్నారు.
