ఆటో చక్రాలకు బ్రేకులు పడతాయా?.. ఆగస్టు 23 నుంచి ఆటో డ్రైవర్ల సమ్మె

 ఆటో చక్రాలకు బ్రేకులు పడతాయా?.. ఆగస్టు 23 నుంచి ఆటో డ్రైవర్ల సమ్మె

బషీర్‌‌‌‌బాగ్‌‌‌‌, వెలుగు: ఆటో, క్యాబ్‌‌‌‌, వ్యాన్‌‌‌‌ డ్రైవర్ల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో ఈ నెల 23 అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మె చేపడతామని ఆటో, క్యాబ్‌‌‌‌, యాప్‌‌‌‌ సంఘాల జేఏసీ కన్వీనర్‌‌‌‌ బి.వెంకటేశం, గౌరవ అధ్యక్షుడు గాజుల ముకేశ్‌‌‌‌గౌడ్‌‌‌‌ హెచ్చరించారు. బషీర్‌‌‌‌బాగ్‌‌‌‌ ప్రెస్‌‌‌‌క్లబ్‌‌‌‌లో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. 

రాష్ట్రంలో సుమారు 7.5 లక్షల మంది, హైదరాబాద్‌‌‌‌లో 2.5 లక్షల మంది ఆటోల​పై ఆధారపడి జీవిస్తున్నారని వెంకటేశం తెలిపారు. ఆర్టీసీ, కార్పొరేట్‌‌‌‌ సంస్థలకు ఈవీ ఆటోలను అందించే ప్రతిపాదనను నిలిపివేయాలని, డ్రైవర్లకు ఏడాదికి రూ.12 వేల ఆర్థిక సాయం అందించాలని కోరారు. ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం థర్డ్‌‌‌‌పార్టీ బీమా కల్పించాలని గాజుల ముకేశ్‌‌‌‌గౌడ్‌‌‌‌ డిమాండ్‌‌‌‌ చేశారు. 

ప్రభుత్వం ప్రత్యేక ఆటో యాప్‌‌‌‌ను తీసుకురావాలని సూచించారు. డిమాండ్ల పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్తంగా ఆటో బంద్‌‌‌‌, రాస్తారోకోలు నిర్వహిస్తామని, సచివాలయం, ప్రజాభవన్‌‌‌‌, జిల్లా కలెక్టరేట్‌‌‌‌లను ముట్టడిస్తామని జేఏసీ నేతలు హెచ్చరించారు.