- దర్యాప్తు, ఫోరెన్సిక్, ప్రాసిక్యూషన్, విచారణ.. ప్రతి దశ కీలకమేనని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్), భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్‌ఎస్‌ఎస్), భారతీయ సాక్ష్య అధినియమం (బీఎస్‌ఏ) అమలులో డిజిటల్ వేదికల వినియోగం అవసరమని హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ అన్నారు. నేరం నమోదైనప్పటి నుంచి దర్యాప్తు, ఫోరెన్సిక్, ప్రాసిక్యూషన్, న్యాయస్థానంలో విచారణ వరకు ప్రతి దశ కీలకమన్నారు. తెలంగాణ స్టేట్ జ్యుడీషియల్ అకాడమీ, తెలంగాణ పోలీస్ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ‘కొత్త క్రిమినల్ చట్టాలు, డిజిటల్ వేదికల ద్వారా క్రిమినల్ న్యాయ వ్యవస్థను బలోపేతం చేయడం’ అనే అంశంపై గురువారం సికింద్రాబాద్‌లోని జ్యుడీషియల్ అకాడమీలో సదస్సు నిర్వహించారు.
ఈ సదస్సును సీజే ప్రారంభించి మాట్లాడారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేసినప్పుడే ఫలితం ఉంటుందని పేర్కొన్నారు. కొత్త నేర చట్టాల అమలులో సంస్థల మధ్య సమన్వయం, సాంకేతిక పరిజ్ఞానం కీలకపాత్ర పోషిస్తాయని తెలిపారు. ప్రతి విభాగం తన బాధ్యతతోపాటు ఇతర విభాగాలు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. జ్యుడీషియల్ అకాడమీ అధ్యక్షురాలు జస్టిస్ మౌషుమి భట్టాచార్య మాట్లాడుతూ.. సాంకేతిక పరిజ్ఞానం పనిభారాన్ని పెంచకుండా ప్రక్రియలను సులభతరం చేయాలని సూచించారు. డీజీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. కొత్త నేర చట్టాలు, కొత్త నిబంధనలు తీసుకురావడం మాత్రమే కాదని, పౌర కేంద్రిత న్యాయం, శాస్త్రీయ దర్యాప్తు, డిజిటల్ ఆధారాలతో కూడిన ప్రక్రియలకు ప్రాధాన్యం ఇచ్చే సమగ్ర మార్పు అని వివరించారు.
