కామారెడ్డిలోఎస్సై, కరీంనగర్ లో జీపీవో..లంచం తీసుకుంటూ పట్టుబడిన ఆఫీసర్లు

కామారెడ్డిలోఎస్సై, కరీంనగర్ లో జీపీవో..లంచం తీసుకుంటూ పట్టుబడిన ఆఫీసర్లు
  • స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు రూ. 30 వేలు తీసుకున్న ఎస్సై
  • ఫీల్డ్ ఎంక్వైరీ కోసం రూ. 20 వేలు తీసుకున్న జీపీవో

కామారెడ్డి, వెలుగు : స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు లంచం తీసుకున్న కామారెడ్డి జిల్లా రాజంపేట ఎస్సై ఆంజనేయులును ఏసీబీ ఆఫీసర్లు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఏసీబీ ఆఫీసర్లు తెలిపిన వివరాల ప్రకారం.. రాజంపేట మండల కేంద్రంలో సిమెంట్ అమ్మకాల విషయంలో షాపుల ఓనర్ల మధ్య ఈ నెల 10న గొడవ జరిగింది. ఈ క్రమంలో సంతోష్ అనే వ్యక్తిపై కేసు నమోదు అయింది. సంతోష్​కు స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు ఎస్సై ఆంజనేయులు రూ. 50 వేలు డిమాండ్ చేయడంతో గతంలోనే రూ. 10 వేలు ఇచ్చాడు. మిగతా డబ్బుల కోసం ఎస్సై ఒత్తిడి చేస్తుండడంతో సంతోష్ తండ్రి సిద్దిరాములు ఏసీబీ ఆఫీసర్లకు ఫిర్యాదు చేశాడు. 

వారి సూచనతో సిద్దిరాములు గురువారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎన్జీవోస్​కాలనీలో ఎస్సై ఇంటికి వెళ్లి రూ. 30 వేలు ఇచ్చాడు. ఇదే సమయంలో అక్కడికి వచ్చిన ఏసీబీ ఆఫీసర్లు ఎస్సై ఆంజనేయులును రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అనంతరం ఎస్సైఇంట్లో, రాజంపేట పోలీస్​స్టేషన్ లో తనిఖీలు చేశారు. ఎస్సై ఆంజనేయులును హైదారాబాద్​లోని ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు అధికారులు తెలిపారు.

వ్యవసాయ భూమి ఫీల్డ్ ఎంక్వైరీ చేసేందుకు...

శంకరపట్నం, వెలుగు : వ్యవసాయ భూమి ఫీల్డ్ ఎంక్వైరీ చేసి పాస్ బుక్ ఇచ్చేందుకు రూ. 20 వేలు తీసుకున్న కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మొలంగూర్ జీపీవో కంపేటి శ్రీనివాస్ ను ఏసీబీ ఆఫీసర్లు పట్టుకున్నారు. శంకరపట్నం మండలం రాజపూర్ గ్రామానికి చెందిన ఓ రైతు తండ్రి పేరిట మొలంగూర్ శివారులో 3.32 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఆ భూమిని గిఫ్ట్ డీడ్ చేసుకునేందుకు స్లాట్ బుక్ చేసుకున్నాడు. ఫీల్డ్ ఎంక్వైరీ చేసి పాస్ బుక్ జారీ చేసేందుకు సదరు రైతు తహసీల్దార్ ఆఫీస్ లో జీపీవో శ్రీనివాస్ ను కలిశాడు.

 పని పూర్తయ్యేందుకు రూ. 20 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో రైతు ఏసీబీ ఆఫీసర్లకు ఫిర్యాదు చేశాడు. వారి సూచనతో గురువారం జీపీవో వద్దకు వెళ్లి రూ. 15 వేలు ఇచ్చేందుకు ప్రయత్నించగా.. మరో రూ. 5 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో రైతు రూ. 20 వేలు ఇచ్చాడు. అప్పుడే అక్కడికి వచ్చిన ఏసీబీ ఆఫీసర్లు జీపీవోను రెడ్ హ్యాండెడ్ గా  పట్టుకున్నారు.