కౌటాలలో పులి సంచారం.. పాదముద్రలను గుర్తించిన అటవీ అధికారులు

కౌటాలలో పులి సంచారం.. పాదముద్రలను గుర్తించిన అటవీ అధికారులు

కాగజ్ నగర్, వెలుగు : కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం గుండాయిపేట సమీపంలో పెద్దపులి సంచారం కలకలం రేపింది. గ్రామ శివారులోని మిరప చేనులో గురువారం ఉదయం పులి పాదముద్రలను కనిపించడంతో స్థానికులు ఫారెస్ట్ ఆఫీసర్లకు సమాచారం ఇచ్చారు. దీంతో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ తులసీదాస్, ములుగు ఫారెస్ట్ రీసెర్చ్ కాలేజీ స్టూడెంట్స్ తో ఘటనాస్థలానికి చేరుకుని పాదముద్రలు పెద్దపులివేనని నిర్ధారించారు. 

పులి వార్ధా నది వైపు వెళ్లినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. నది దాటిన పులి మహారాష్ట్ర లోని చాప్రాల వైల్డ్ లైఫ్ సాంక్చురీ వైపు వెళ్లి ఉంటుందని భావిస్తున్నారు. పులి సంచారంతో పరిసర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారులు గ్రామాల్లో డప్పు చాటింపు వేయించారు. 

ఉదయం, రాత్రి సమయాల్లో ప్రజలు పొలాల వైపు వెళ్లొద్దని, అత్యవసరమైతే గుంపులుగా వెళ్లాలని సూచించారు. పులి, వైల్డ్ ఎనిమల్ మూమెంట్స్ ఉన్న నేపథ్యంలో అడవిలోకి ఎవరూ వెళ్లొద్దంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అనుమతి లేకుండా అడవిలోకి వెళ్తే కేసులు నమోదు చేస్తామని ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ మోహన్ రావు హెచ్చరించారు