పోలీస్ శాఖలోని కానిస్టేబుల్ నియామకాల విషయంలో షెడ్యూల్డ్ ఏరియా ఆదివాసీ అభ్యర్థులకు ప్రత్యేక ప్రాతినిధ్యం కల్పించే విధానం గతంలో అమలులో ఉంది. 2022 తెలంగాణ కానిస్టేబుల్ నియామక నోటిఫికేషన్‌లో షెడ్యూల్డ్ ఏరియా పోలీస్ స్టేషన్లలోని 75% పోలీస్ కానిస్టేబుల్ (సివిల్) ఖాళీలను షెడ్యూల్డ్ ఏరియాల్లో డొమిసైల్ ఉన్న షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఎబో రీజినల్ ట్రైబ్స్ అభ్యర్థులతో భర్తీ చేయాలని స్పష్టంగా పేర్కొన్నారు.
అటువంటి ప్రత్యేక రక్షణను ప్రస్తుత నియామక ప్రక్రియలో స్పష్టంగా చూపించకపోతే అది ఆదివాసీ యువతలో సహజంగానే ఆందోళనకు దారితీస్తుంది. తెలంగాణలో గత పోలీస్ కానిస్టేబుల్ నియామక నిబంధనల్లో షెడ్యూల్డ్ ఏరియా పోలీస్ స్టేషన్లలోని 75% కానిస్టేబుల్ పోస్టులను షెడ్యూల్డ్ ఏరియాల్లో నివసించే ఎస్టీ, ఎబోరిజినల్ ట్రైబల్స్ అభ్యర్థులతో భర్తీచేసే విధానం పేర్కొనడమైనది. ఈ ప్రత్యేక హక్కును కేవలం సాధారణ ఎస్టీ రిజర్వేషన్‌గా చూడకూడదు.
షెడ్యూల్డ్ ఏరియా స్థానిక ఆదివాసీ నిరుద్యోగ యువతకు కల్పించిన ప్రత్యేక రక్షణగా చూడాలి. ప్రస్తుత కానిస్టేబుల్ నియామక ప్రక్రియలో షెడ్యూల్డ్ ఏరియా పోస్టులకు సంబంధించి 75% ప్రత్యేక రిజర్వేషన్‌ను స్పష్టంగా పేర్కొనకపోతే, ఆదివాసీ అభ్యర్థులకు అనేక సందేహాలు ఏర్పడతాయి. షెడ్యూల్డ్ ఏరియా పోలీస్ స్టేషన్లలోని పోస్టులకు 75% ప్రత్యేక రిజర్వేషన్ కొనసాగుతుందా? కొనసాగితే నోటిఫికేషన్‌లో దానిని స్పష్టంగా ఎందుకు పేర్కొనలేదు? గత నియామకాల్లో ఉన్న ప్రత్యేక నిబంధనలను ప్రస్తుత నియామకంలో ఎలా కొనసాగిస్తున్నారు? ఈ ప్రశ్నలకు ప్రభుత్వం, పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు సమాధానం ఇవ్వాలి.
- డా. సాగబోయిన పాపారావు
ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ
openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని
హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.
