న్యూఢిల్లీ: ఇండియా హెప్టాథ్లాన్ స్టార్ అథ్లెట్ స్వప్నా బర్మన్.. డోప్ పరీక్షలో పట్టుబడింది. ఆమె నిషేధిత ఉత్ప్రేరకం ‘బోల్డెనోన్’ అనే అనబాలిక్ ఆండ్రోజెనిక్ స్టెరాయిడ్‌ను వాడినట్లు ‘ఎ’ శాంపిల్స్ పరీక్షలో తేలింది. దాంతో స్వప్నపై నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెనీ (నాడా) తాత్కాలికంగా సస్పెన్షన్ విధించింది.
2018 జకార్తా ఆసియా క్రీడల్లో 29 ఏళ్ల స్వప్నా హెప్టాథ్లాన్‌లో స్వర్ణం నెగ్గింది. ఫలితంగా ఈ ఘనత సాధించిన తొలి ఇండియా అథ్లెట్‌గా చరిత్ర సృష్టించింది. 2016 రియో ఒలింపిక్స్‌లోనూ బరిలోకి దిగింది. గాయాల కారణంగా శరీరం సహకరించకపోవడంతో ఇటీవలే ఆమె కెరీర్‌కు గుడ్‌బై చెప్పింది. అయితే వీడ్కోలు పలికిన కొద్ది రోజుల్లోనే డోపింగ్ ఉదంతం వెలుగులోకి రావడంతో క్రీడావర్గాల్లో కలకలం చోటు చేసుకుంది.
త్వరలోనే ఆమె ‘బి’ శాంపిల్స్‌ను పరీక్షించే అవకాశం ఉంది. గతేడాది ఔటాప్ కాంపిటీషన్‌లో భాగంగా నిర్వహించిన డోప్ పరీక్షలో పట్టుబడిన హాకీ ప్లేయర్ మయాంక్ శర్మపై నాలుగేళ్ల నిషేధం పడింది. విమెన్స్ రన్నర్ సంజనా సింగ్‌పై కూడా ఐదేళ్ల నిషేధం విధించారు.
