కోట కినాబాలు (మలేసియా): ఏఎఫ్‌సీ విమెన్స్ చాంపియన్స్ లీగ్ 2026–27 ప్రిలిమినరీ స్టేజ్‌లో ఈస్ట్ బెంగాల్ ఎఫ్‌సీ జట్టు సంచలన విజయం సాధించింది. గురువారం జరిగిన రెండో మ్యాచ్‌లో 12–0తో రోవర్స్ ఎఫ్‌సీ (గువామ్)ను చిత్తు చేసింది. తాజా విజయంతో 1985–86 ఆసియా క్లబ్ చాంపియన్‌షిప్‌లో క్లబ్ వాలెన్సియా (మాల్దీవ్స్)పై ఈస్ట్ బెంగాల్ మెన్స్ జట్టు సాధించిన 9–0 రికార్డు విజయాన్ని విమెన్స్ జట్టు అధిగమించింది.
మెన్స్, విమెన్స్ ఆసియా పోటీల్లో ఒక ఇండియన్ క్లబ్ సాధించిన అతిపెద్ద విజయం ఇదే కావడం విశేషం. ఈస్ట్ బెంగాల్ తరఫున ప్రియాంక దేవి (6వ ని), ఆస్తమ్ ఒరాన్ (15వ ని), ప్రియాంక (22వ ని), ఒలివియా అనోక్యే (48, 58వ ని), అబిగైల్ అంట్వికి (49వ ని), సులంజన (51వ ని), షిల్కీ (56వ ని), అబెనా ఒపోకు (64వ ని), అబెనా (70వ ని), అంజు (73వ ని), గుగులోత్ సౌమ్య (93+3) గోల్స్ కొట్టారు.
ఈ టోర్నీలో ఇండియా అమ్మాయిలకు ఇది వరుసగా రెండో విజయం కాగా, ఆదివారం జరిగే మూడో మ్యాచ్‌లో సబా ఎఫ్‌సీ (మలేసియా)తో తలపడతారు. ఇందులో గెలిస్తే గ్రూప్ స్టేజ్‌కు అర్హత సాధిస్తారు.
