ఆమ్‌స్టెల్విన్: ఎఫ్‌ఐహెచ్ హాకీ వరల్డ్ కప్‌లో ఇండియా విమెన్స్ జట్టు రెండో రౌండ్‌లోకి ప్రవేశించింది. గురువారం ఇంగ్లండ్‌తో జరిగిన పూల్–డి ఆఖరి లీగ్ మ్యాచ్‌ను ఇండియా 0–0తో డ్రా చేసుకుంది. దాంతో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఒక విజయం, రెండు డ్రాలతో పూల్‌లో రెండో ప్లేస్‌లో నిలిచింది.
చివరి నిమిషం వరకు హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో ఇండియా ప్లేయర్లు తీవ్రమైన ఒత్తిడిని తట్టుకుని నిలబడ్డారు. మొత్తం 12 పెనాల్టీ కార్నర్లను అడ్డుకున్నారు. అదే టైమ్‌లో ఆరు పెనాల్టీ కార్నర్లు లభించినా ఒక్క దాన్ని కూడా గోల్‌గా మల్చలేకపోయారు. దీపిక, నవనీత్ కౌర్ తమ అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయారు. అంతకుముందు జరిగిన మ్యాచ్‌లో చైనా 5–1తో సౌతాఫ్రికాను ఓడించి టాప్ ప్లేస్‌లో నిలిచింది.
దూకుడుగా ఆడినా...
మ్యాచ్ ఆరంభాన్ని దూకుడుగా మొదలుపెట్టిన ఇండియా తొలి 15 నిమిషాల్లోనే మూడు పెనాల్టీ కార్నర్లను సంపాదించింది. 4వ నిమిషంలో సునెలిట పంపిన పాస్‌ను నవనీత్ కొట్టగా అది ఇషిక స్టిక్‌కు తాకి గోల్‌గా మారినట్లు కనిపించింది. కానీ అంపైర్లు తిరస్కరించారు. రెండో పెనాల్టీని నవనీత్ లక్ష్యం నుంచి దూరంగా కొట్టింది. వెంటనే ఎదురుదాడికి దిగిన ఇంగ్లండ్ 10వ నిమిషంలో తొలి పెనాల్టీని సంపాదించింది. కానీ సోఫీ హామిల్టన్ డ్రాగ్ ఫ్లిక్‌ను సునెలిట అద్భుతంగా సేవ్ చేయగా జ్యోతి అడ్డుకుంది.
21వ నిమిషంలో నవనీత్ పాస్‌ను కెప్టెన్ సలీమా టెటే అందుకుని ఇషికాకు పాస్ ఇచ్చినా గోల్‌గా మల్చలేకపోయారు. 24వ నిమిషంలో లాల్‌రెమిసియామి నాలుగో పెనాల్టీని సాధించినా ఇంగ్లండ్ గోల్ కీపర్ మిరియం ప్రిచర్డ్ తన కుడి కాలుతో అడ్డుకుంది. రెండో క్వార్టర్ చివరలో హోవార్డ్‌కు ఎల్లో కార్డు చూపించడంతో ఇంగ్లండ్ రెండో పెనాల్టీని వృథా చేసుకుంది. దీంతో ఆ జట్టు ఐదు నిమిషాల పాటు 10 మంది ప్లేయర్లతోనే ఆడాల్సి వచ్చింది. మూడో క్వార్టర్‌లో పట్టు బిగించిన ఇంగ్లండ్.. ఇండియా డిఫెన్స్‌పై నిరంతరం ఒత్తిడిని కొనసాగించింది.
సవిత కీలకమైన సేవ్‌లను చేసింది. 43వ నిమిషంలో ఇంగ్లండ్‌కు వరుసగా మూడు పెనాల్టీలు లభించినా సవిత అనుభవంతో అడ్డుకుంది. సాక్షి డిఫెన్స్‌తో ఆకట్టుకుంది. 45వ నిమిషంలో కొట్టిన పెనాల్టీని సలీమా నిలువరించింది. 50వ నిమిషంలో ఇంగ్లండ్‌కు పెనాల్టీ లభించినా.. ఇండియా రిఫరల్‌ను కోల్పోయింది. ఆ వెంటనే మరో పెనాల్టీ కార్నర్ లభించగా, దాన్ని బిచ్చు సేవ్ చేసింది. అయితే రీ బౌండ్ అయిన బాల్‌ను నవనీత్ క్లియర్ చేసింది. టైమ్ ముగిసిపోతుండటంతో ఇంగ్లండ్ గోల్ కీపర్‌ను తొలగించి విజయం కోసం సర్వశక్తులను ఒడ్డింది.
అయితే గోల్ కీపర్లు సవితా పూనియా, బిచ్చుదేవి అద్భుతమైన ఆటతో ఇండియాను గట్టెక్కించారు. చివరి నిమిషాల్లో ఉండే ఒత్తిడిని జయించారు. ఆట ముగియడానికి 30 సెకన్లు మిగిలి ఉండగా బిచ్చు ఎడమ వైపు డైవ్ చేసి బంతిని నిలువరించింది. ఫలితంగా ఇండియా మ్యాచ్‌ను డ్రా చేసుకోవడంతో తదుపరి రౌండ్‌కు అర్హత సాధించింది. రెండో రౌండ్లో ఇండియా, చైనాలు చెరో పాయింట్‌తో ముందుకెళ్తాయి.
