నీట్ ఆందోళనలో పోలీసుల చర్యలపై.. ఐదుగురితో హైపవర్ కమిటీ

నీట్ ఆందోళనలో పోలీసుల చర్యలపై.. ఐదుగురితో హైపవర్ కమిటీ
  • చైర్మన్​గా జస్టిస్ సుభాష్‌‌‌‌‌‌‌‌రెడ్డి
  • సభ్యులుగా జస్టిస్​ రవి శంకర్ ఝా, జస్టిస్ శాలిందర్ కౌర్, రిషి కుమార్ శుక్లా, ఎల్ఆర్ బిష్ణోయ్
  • ఖరారు చేసిన సుప్రీంకోర్టు
  • పోలీసుల అత్యుత్సాహం, పెల్లెట్ గన్స్‌‌‌‌‌‌‌‌ వాడకంపై విచారణ చేపట్టనున్న కమిటీ
  • మహిళా ఆందోళనకారులపై వేధింపుల ఆరోపణలను తేల్చనున్న టీమ్​ 
  • పోలీసులపై దాడులు, వారి ఇబ్బందులపైనా వివరాల సేకరణ

న్యూఢిల్లీ: నీట్​ పేపర్​ లీకేజీకి వ్యతిరేకంగా ఢిల్లీలో ఆందోళన చేపట్టిన స్టూడెంట్స్​పై పోలీసుల చర్యలకు సంబంధించి విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యులతో కూడిన హైపవర్ కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆర్ సుభాష్‌‌‌‌‌‌‌‌రెడ్డి చైర్మన్‌‌‌‌‌‌‌‌గా వ్యవహరించనున్నారు. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్‌‌‌‌‌‌‌‌మాల్య బాగ్చీ, జస్టిస్ వి. మోహనాతో కూడిన ధర్మాసనం గురువారం ఈ కమిటీని ఏర్పాటు చేసింది.

పంజాబ్ -హైకోర్టు మాజీ సీజే జస్టిస్ రవి శంకర్ ఝా, ఢిల్లీ హైకోర్టు మాజీ జడ్జి జస్టిస్ శాలిందర్ కౌర్, మాజీ సీబీఐ డైరెక్టర్ రిషి కుమార్ శుక్లా, రిటైర్డ్ మేఘాలయ డీజీపీ ఎల్ఆర్ బిష్ణోయ్ కమిటీ సభ్యులుగా ఉంటారు.  పోలీసులు అధిక బలప్రయోగం చేశారా? పెల్లెట్ గన్స్‌‌ను ఉపయోగించారా? అనే అంశాలను కమిటీ పరిశీలించనుంది. పోలీసులు, భద్రతా సిబ్బందిపై ఆందోళనకారులు హింసకు పాల్పడ్డారన్న ఆరోపణలపైనా విచారణ జరపనుంది. 

మహిళా ఆందోళనకారులను లక్ష్యంగా చేసుకుని హింస, వేధింపులు, లైంగిక వేధింపులు జరిగినట్లు వచ్చిన ఆరోపణలను తేల్చాలని కమిటీని  సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇక పోలీసు సిబ్బంది, ఆందోళనకారులు.. ఇరువైపులా గాయపడిన వారికి మధ్యంతర పరిహారం అందించే అంశాన్ని కూడా కమిటీ పరిశీలించవచ్చని కోర్టు తెలిపింది. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు జరిగిన నష్టం, గవర్నమెంట్​ఆఫీసులు, వెహికల్స్, ఇతర ఆస్తుల ధ్వంసంపై కమిటీ నివేదిక ఇవ్వనుంది. గాయపడిన పోలీసు సిబ్బందితో పాటు, వారి కుటుంబాలు ఎదుర్కొన్న మానసిక వేదనను కూడా ఆందోళనకారుల ఫిర్యాదులతో సమానంగా పరిగణించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ కమిటీ ఎప్పటికప్పుడు మధ్యంతర నివేదికలను సమర్పించాలని కోర్టు ఆదేశించింది. 

ఫిర్యాదులు, ఆధారాలు ఇచ్చేందుకు అవకాశం

ఆందోళనలకు సంబంధించిన పత్రాలు, ఆధారాలు, సూచనలను ఎవరైనా కమిటీకి సమర్పించవచ్చని కోర్టు తెలిపింది. ఆధారాలు సమర్పించే వ్యక్తులు కోరితే.. వారి ఐడెంటిటీని బయటకు చెప్పాల్సిన అవసరం లేదని వెల్లడించింది.  

భద్రపరచిన వీడియోలను కమిటీకి ఇవ్వండి  

స్టూడెంట్స్​ ఆందోళనలపై అధికారులు సేకరించిన సీసీటీవీ ఫుటేజీ, డ్రోన్ ఫుటేజీ, బాడీ-వోర్న్ కెమెరా రికార్డింగ్స్, వీడియోలు, వైర్‌‌లెస్ కమ్యూనికేషన్ రికార్డులు, పీసీఆర్ కాల్ లాగ్స్ సహా అన్ని ఆధారాలను హైపవర్ కమిటీకి అందించాలని పోలీసులు, పారామిలటరీ బలగాలు, ఇతర దర్యాప్తు సంస్థలను సుప్రీంకోర్టు ఆదేశించింది. అదేవిధంగా.. ఆందోళనల సమయంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన పోలీసు, భద్రతా సిబ్బందిపై శాఖాపరమైన లేదా క్రమశిక్షణ చర్యలు తీసుకోవడాన్ని కోర్టు అడ్డుకోబోదని తెలిపింది. వివాదానికి సంబంధించిన అంశాలపై రాజకీయ పార్టీల మధ్య సమన్వయం కోసం న్యాయవాదులు అషిమా మండ్లా, దక్ష్ కడియాన్, ఆస్తా సింగ్‌‌ను నోడల్ అధికారులుగా సుప్రీంకోర్టు నియమించింది.

కేంద్రం సహకరించాలి.. 

కమిటీ చైర్మన్‌‌కు సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జికి సమానమైన గౌరవ వేతనం, సౌకర్యాలు కల్పించాలని కేంద్రాన్ని కోర్టు ఆదేశించింది. ఢిల్లీలో వసతి, ప్రయాణ సౌకర్యాలు కూడా కల్పించాలని సూచించింది. చైర్మన్ సూచన మేరకు కమిటీ సభ్యులకు గౌరవ వేతనం చెల్లించాలని, కేంద్ర ప్రభుత్వం ఆ నిధులను సమకూర్చాలని పేర్కొంది. కమిటీకి సిబ్బంది, కార్యదర్శి సహా అన్ని పరిపాలనా సౌకర్యాలను అందించాలని ఆదేశించింది.