- కర్నాటకలో రైతుల ఆందోళనలు.. తమిళనాడుకు నీళ్లు ఇవ్వొద్దంటూ డిమాండ్
బెంగళూరు/మండ్య: తమిళనాడుకు కావేరీ నీటిని విడుదల చేయడంపై కర్నాటకలో నిరసనలు మళ్లీ భగ్గుమన్నాయి. కేఆర్ఎస్ డ్యామ్ నుంచి ఆగస్టు 12 నుంచి 15 రోజుల పాటు రోజుకు 12 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలన్న కావేరీ నీటి నియంత్రణ కమిటీ (సీడబ్ల్యూఆర్సీ) సిఫార్సును కావేరీ నీటి నిర్వహణ అథారిటీ (సీఎంఏ) సమర్థించింది. దీంతో మండ్యలో రైతులు, కన్నడ సేన కార్యకర్తలు ఆందోళనకు దిగారు.
సంజయ్ సర్కిల్ వద్ద బైఠాయించి బెంగళూరు-–మైసూరు రోడ్డును దిగ్బంధించారు. డ్యామ్‌లో నీటి మట్టం 109 అడుగులే ఉన్నప్పుడు తమిళనాడుకు నీళ్లు ఎలా విడుదల చేస్తారని ప్రశ్నించారు. కరువు పరిస్థితుల్లో రాష్ట్ర రైతులకు నీరందించకుండా తమిళనాడుకు నీళ్లు ఇవ్వొద్దని మండ్య ఎమ్మెల్యే రవికుమార్ గౌడ డిమాండ్ చేశారు. మరోవైపు కావేరీ వివాదాన్ని కేంద్ర మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్లినట్లు తమిళనాడు సీఎం కార్యాలయ వర్గాలు తెలిపాయి. మేకెదాటు వద్ద బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మించాలని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ప్రతిపాదించారు.
