రాజీవ్ గాంధీ విజనరీ లీడర్..మాజీ ప్రధానికి కాంగ్రెస్ నేతల నివాళులు

రాజీవ్ గాంధీ విజనరీ లీడర్..మాజీ ప్రధానికి కాంగ్రెస్ నేతల నివాళులు

న్యూఢిల్లీ: దేశాన్ని సాంకేతిక పురోగతి వైపు నడిపించిన దార్శనికుడు రాజీవ్ గాంధీ అని కాంగ్రెస్​నేతలు కొనియాడారు. మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ 82వ జయంతిని పురస్కరించుకుని గురువారం దిల్లీలోని వీర్ భూమి వద్ద కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, సీనియర్ నేత సోనియా గాంధీ, ప్రియాంకాగాంధీ తదితరులు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.

 దేశంలో 18 ఏండ్ల యువతకు ఓటు హక్కు కల్పించడం, నవోదయ విద్యాలయాల ఏర్పాటు, ఐటీ విప్లవానికి పునాదులు వేయడం ఆయన దూరదృష్టికి నిదర్శనమని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. సమాజంలో శాంతి, ఐక్యతలను పెంపొందించడమే ఆయనకు మనం అర్పించే నిజమైన నివాళి అని నేతలు అభిప్రాయపడ్డారు. రాజీవ్ గాంధీ జయంతిని 'సద్భావనా దివస్'‌‌గా పాటిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కేసీ వేణుగోపాల్‌‌తో పాటు పలువురు పార్టీ ప్రముఖులు పాల్గొన్నారు.

రాజీవ్‌‌కు ప్రధాని మోదీ నివాళి.. 

మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు. ఈ మేరకు 'ఎక్స్' వేదికగా మోదీ స్పందిస్తూ.. "మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తున్నాను" అంటూ పేర్కొన్నారు.