హైదరాబాద్‌లో జువెలరీ వ్యాపారి మిస్సింగ్.. కిడ్నాప్ లేదా అదృశ్యమా?

హైదరాబాద్‌లో జువెలరీ వ్యాపారి మిస్సింగ్.. కిడ్నాప్ లేదా అదృశ్యమా?

హైదరాబాద్: చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ బంగారు వ్యాపారి అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. చిక్కడపల్లికి చెందిన వ్యాపారి శ్రీనివాస్ రావు నిన్నటి నుంచి కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. ఆయన బామ్మర్ది మురళీకృష్ణ చిక్కడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసుల వివరాల ప్రకారం.. శ్రీనివాస్ రావుకు చిక్కడపల్లిలో నివాసం ఉండగా, రామంతపూర్‌లో జువెలరీ షాపు ఉంది. అక్టోబర్ 5న ఉదయం ఇంటి నుంచి షాపుకు వెళ్లిన ఆయన తిరిగి ఇంటికి రాలేదు. కుటుంబ సభ్యులు షాపులో ఆరా తీసినా అక్కడ కూడా శ్రీనివాస్ కనిపించకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు స్వీకరించిన చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శ్రీనివాస్ రావు ఆచూకీ కోసం మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.

వ్యాపారి ఆచూకీ తెలియకపోవడంతో ఆయనను ఎవరైనా కిడ్నాప్ చేశారా? లేక స్వచ్ఛందంగా ఎక్కడికైనా వెళ్లారా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శ్రీనివాస్ రావు అదృశ్యానికి సంబంధించి అన్ని కోణాల్లో ఆధారాలను సేకరిస్తున్న పోలీసులు, ఆయన ఆచూకీ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు.