హార్ముజ్ లో వాణిజ్య నౌకపై క్షిపణి దాడి..11 మంది భారతీయ నావికులకు గాయాలు

హార్ముజ్ లో వాణిజ్య నౌకపై క్షిపణి దాడి..11 మంది భారతీయ నావికులకు గాయాలు

హార్ముజ్ జలసంధి సమీపంలోని ఒమన్ తీరంలో పనామా జెండాతో ప్రయాణిస్తున్న  ఎంటీ ఆన్ పీస్ (MT On Peace) వాణిజ్య నౌకపై క్షిపణి దాడి జరిగింది. ఈ ఘటనలో నౌకలో ఉన్న 11 మంది భారతీయ నావికులు గాయపడ్డారు.  ప్రమాద సమయంలో నౌకలో మొత్తం 19 మంది సిబ్బంది ఉండగా, వారిలో 17 మంది భారతీయులు ఉన్నారు. మొత్తం 12 మంది సిబ్బంది గాయపడగా, వారిలో 11 మంది భారతీయ పౌరులు ఉన్నారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) మంగళవారం(అక్టోబర్6) ధృవీకరించింది. గాయపడిన సిబ్బందిని ఒమన్ లోని ఖసాబ్ కు తరలించి చికిత్స అందిస్తున్నారని MEA తెలిపింది.   గాయపడిన భారతీయ నావికులకు ఒమన్ అధికారులు చేసిన సహాయానికి ధన్యవాదాలు తెలిపింది.

 హార్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌక పై దాడిని భారత్ ఖండించింది.ఆ ప్రాంతంలో నౌకా రవాణాపై కొనసాగుతున్న దాడుల పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. హార్ముజ్ లో శాంతి నెలకొల్పేందుకు ఇలాంటి దాడులను తక్షణమే నిలిపివేయాలని పిలుపునిచ్చింది.  చమురు రవాణాకు ఎంతో కీలకమైన  ఈ అంతర్జాతీయ జలమార్గాన్ని వీలైనంత త్వరగా పునరుద్దరించాలని  కోరింది.