పంజాబ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఎం భగవంత్ మాన్ క్యాంప్ ఆఫీసుపై సీబీఐ అధికారులు దాడులు చేశారు. చండీగఢ్‌లోని సీఎం క్యాంప్ ఆఫీసుతో పాటు ఆయన ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (OSD) రాజ్‌బీర్ సింగ్ ఘుమన్ నివాసంలోనూ మంగళవారం (అక్టోబర్06) సాయంత్రం సీబీఐ అధికారులు తనిఖీలు చేశారు.
పంజాబ్ ప్రభుత్వంలో భారీ అవినీతి జరిగిందన్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ఆరోపణల క్రమంలో ఈ చర్య చోటుచేసుకుంది. ఈ ఆరోపణలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని పంజాబ్, హర్యానా హైకోర్టు సీబీఐని ఆదేశించిన మరుసటి రోజే సోదాలు జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఏంటీ కేసు..
గ్రేటర్ మొహాలీ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (GMADA) పరిధిలోని కంపెనీల భూ కేటాయింపుల అనుమతుల్లో అవకతవకలు, అనుమానాస్పద అమ్మకాల లావాదేవీలపై ఈడీ మనీలాండరింగ్ దర్యాప్తు చేపట్టింది. ఈ వ్యవహారంలో నితిన్ గోహల్ అనే వ్యక్తి ఇంటిపై కూడా ఈడీ దాడులు నిర్వహించింది.
ఈడీ ఆరోపణల ప్రకారం.. ప్రభుత్వ ప్రయోజనాలు కోరుకునే వ్యక్తులకు, OSD రాజ్‌బీర్ సింగ్ ఘుమన్‌కు మధ్య నితిన్ గోహల్ మధ్యవర్తిగా వ్యవహరించినట్లు పేర్కొంది. ట్రాన్స్ ఫర్లు, ప్రభుత్వ డాక్యుమెంట్ల సీక్రెట్ యాక్సెస్,ఆయుధ లైసెన్సులు పొందడంవంటి వంటి ప్రయోజనాలు పొందినట్లు ఈడీ ఆరోపించింది.
హైకోర్టు ఏం చెప్పింది?
న్యాయవాది నిఖిల్ సరఫ్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL)పై విచారణ చేపట్టిన పంజాబ్, హర్యానా హైకోర్టు.. ఈడీ సమర్పించిన ఆధారాలు విచారణకు అర్హమైన నేరాలను సూచిస్తున్నాయని పేర్కొంది. కేసులో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి సమగ్ర దర్యాప్తు చేయాలని సీబీఐని ఆదేశించింది.
సీబీఐ సోదాలపై సీఎం భగవంత్ మాన్ ఎక్స్ వేదికగా స్పందించారు. పంజాబ్‌లో ఎన్నికలకు ముందు బీజేపీ దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకుంటోందని ఆరోపించారు. తన క్యాంప్ ఆఫీసులో సీబీఐ సోదాలు నిర్వహించిందని, తనను ,పంజాబ్ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు ఈడీ, సీబీఐలను దుర్వినియోగం చేస్తున్నారని భగవంత్ సింగ్ మాన్ ఆరోపించారు.
ఈ కేసులో హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ ఇప్పటికే పంజాబ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ వ్యవహారం ఈ వారం చివరలో సుప్రీంకోర్టు ముందుకు రానుంది. ఇదిలా ఉండగా.. ఈడీ చేసిన ఆరోపణలు ఇంకా దర్యాప్తు దశలోనే ఉన్నాయి. మరోవైపు OSD రాజ్‌బీర్ సింగ్ ఘుమన్, ఆయన సహచరులు గతంలోనే ఆరోపణలను ఖండిస్తూ అవి నిరాధారమైనవని కొట్టిపారేశారు.
సీఎం క్యాంప్ ఆఫీసు, OSD నివాసంలో సీబీఐ సోదాలు జరగడం పంజాబ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అవినీతి ఆరోపణలపై హైకోర్టు ఆదేశాలతో సీబీఐ దర్యాప్తు ప్రారంభం కాగా.. కోర్టు ఆదేశాలను పంజాబ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసిన క్రమంలో ఈ కేసులో తదుపరి న్యాయ విచారణ పరిణామాలు కీలకంగా మారాయి.
