వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిష్ నుంచి సింధు ఔట్..‌ క్వార్టర్స్లో సాత్విక్, గాయత్రి జోడీ

వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిష్ నుంచి సింధు ఔట్..‌ క్వార్టర్స్లో సాత్విక్, గాయత్రి జోడీ

న్యూఢిల్లీ: ఇండియా స్టార్‌‌ షట్లర్‌‌ పీవీ సింధు.. వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌‌షిప్‌‌లో నిరాశపర్చింది. గురువారం జరిగిన విమెన్స్‌‌ సింగిల్స్‌‌ ప్రిక్వార్టర్స్‌‌లో 9వ సీడ్‌‌ సింధు 11–21, 21–15, 17–21తో మూడోసీడ్‌‌ వాంగ్‌‌ జి యి (చైనా) చేతిలో పోరాడి ఓడింది.

గంటా 28 నిమిషాల మ్యాచ్‌‌లో వాంగ్‌‌ రెండు కాళ్లలో తీవ్రమైన క్రాంప్స్‌‌ వచ్చినా పట్టుదలతో ఆడి గెలిచింది. 3–5 ముఖాముఖి రికార్డుతో మ్యాచ్‌‌ మొదలుపెట్టిన సింధు తొలి గేమ్‌‌లో వాంగ్‌‌ అటాకింగ్‌‌ ముందు నిలవలేకపోయింది. అయితే రెండో గేమ్‌‌లో వ్యూహాత్మకంగా ఆడి విజయం సాధించింది.

డిసైడర్‌‌లో ఇద్దరు ప్రతి పాయింట్‌‌ కోసం హోరాహోరీగా పోరాడారు. ఈ క్రమంలో 54  షాట్ల ర్యాలీ నమోదైంది. అయితే చివర్లో మెరుగైన డ్రాప్స్‌‌ వేసిన వాంగ్‌‌ గేమ్‌‌, మ్యాచ్‌‌ను సొంతం చేసుకుంది. మెన్స్‌‌ సింగిల్స్‌‌లో ఆయుశ్‌‌ షెట్టి 19-–21, 11–-21తో అల్వి పర్హాన్‌‌ (ఇండోనేసియా) చేతిలో ఓడాడు. విమెన్స్‌‌ డబుల్స్‌‌ ప్రిక్వార్టర్స్‌‌లో ట్రీసా జాలీ–గాయత్రి గోపీచంద్‌‌ 21–16, 21–12తో ఏడోసీడ్‌‌ రిన్‌‌ ఇవాగానా–కియో నకనిషి (జపాన్‌‌)పై సంచలన విజయం సాధించారు.

మెన్స్‌‌ డబుల్స్‌‌లో ఐదో సీడ్‌‌ సాత్విక్‌‌–చిరాగ్‌‌ షెట్టి 21–23, 21–19, 21–17తో జునైద్‌‌ ఆరిఫ్‌‌–యాప్‌‌ రాయ్‌‌ కింగ్‌‌ (మలేసియా)పై గెలిచి క్వార్టర్స్‌‌లోకి ప్రవేశించారు. మిక్స్‌‌డ్‌‌ డబుల్స్‌‌లో ధ్రువ్‌‌ కపిల–తానీషా క్రాస్టో 16–21, 5–21తో గువో జిన్‌‌ వా–చెన్‌‌ ఫాంగ్ హు (చైనా) చేతిలో కంగుతిన్నారు.