UPI పేమెంట్స్ స్వీకరించే వ్యాపారులకు షాక్.. 2 వారాల్లో ట్రాన్సాక్షన్లపై MDR ఛార్జీలు స్టార్ట్

UPI పేమెంట్స్ స్వీకరించే వ్యాపారులకు షాక్.. 2 వారాల్లో ట్రాన్సాక్షన్లపై MDR ఛార్జీలు స్టార్ట్

మొన్ననే పార్లమెంట్‌లో చట్టం చేసిన మోడీ సర్కార్, డిజిటల్ చెల్లింపుల రంగానికి సంబంధించి మరో సంచలన నిర్ణయానికి తెరదీసింది. దేశంలోని చెల్లింపుల విధానంలో భారీ మార్పులు తెచ్చిన UPIపై.. ముఖ్యంగా రూ.2వేలు అంతకంటే ఎక్కువ మొత్తాలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) ఛార్జీలను మళ్లీ ప్రవేశపెట్టేందుకు వేగంగా అడుగులు వేస్తోంది కేంద్రం.

క్యాష్ లెస్ ఎకానమీని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో గతంలో కేంద్ర ప్రభుత్వం డిజిటల్ లావాదేవీలపై వెసులుబాట్లు కల్పించిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 2019 వరకు డిజిటల్ లావాదేవీలపై గరిష్టంగా 0.3 శాతం వరకు ఎండీఆర్ ఛార్జీలు ఉండేవి. అయితే ఆన్‌లైన్ పేమెంట్స్‌ వైపు ప్రజలను పూర్తిస్థాయిలో ఆకర్షించాలనే లక్ష్యంతో జనవరి 2020 నుంచి Zero MDR విధానాన్ని చట్టపరంగా తీసుకొచ్చింది. దీనివల్ల వ్యాపారులు ఎలాంటి అదనపు రుసుము చెల్లించకుండా యూపీఐ చెల్లింపులను స్వీకరించడానికి అవకాశం దక్కింది. కొత్త ఛార్జీలు మరో రెండు వారాల్లోనే అమలులోకి వస్తాయని వెల్లడైంది.

చట్ట సవరణతో స్పీడందుకున్న అమలు..
తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 'టాక్సేషన్ అండ్ అదర్ లాస్ (సవరణ) బిల్లు, 2026' ద్వారా పేమెంట్స్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్ యాక్ట్, 2007 చట్టాన్ని సవరించారు. ఎండీఆర్ ఛార్జీలకు చట్టపరమైన రక్షణ కల్పించేలా ఈ సవరణలు చేశారు. ఈ నేపథ్యంలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ త్వరలోనే ఒక గెజిట్ నోటిఫికేషన్‌ను జారీ చేయనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఏయే ఎలక్ట్రానిక్ పేమెంట్ మోడ్స్‌కు ఈ చట్టపరమైన రక్షణ లభిస్తుందనే పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.

NPCI ఆధ్వర్యంలో విధివిధానాలు..
నోటిఫికేషన్ వెలువడిన వెంటనే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) నేతృత్వంలోని సర్వీసెస్ స్టీరింగ్ కమిటీ రంగంలోకి దిగనుంది. ఈ కమిటీయే ఈ ఛార్జీల పరిధి, స్కోప్, స్ట్రక్చర్‌ను నిర్ణయించనుంది. రూ.2వేలు దాటిన లావాదేవీలపై ఈ ఛార్జీల విధింపు విధానం ఎలా ఉండాలనేదానిపై త్వరలోనే స్పష్టత రానుంది.

వినియోగదారులపై నేరుగా భారం ఉండదు..
ఈ పరిణామాలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టతనిచ్చారు. వ్యాపారులు చెల్లించే ఈ మర్చంట్ డిస్కౌంట్ రేట్ ఛార్జీల భారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సామాన్య వినియోగదారులపైకి మళ్లించబోమని స్పష్టం చేశారు. అంటే ఈ ఖర్చులను వ్యాపారులే భరించాల్సి ఉంటుందన్నమాట. సాధారణ యూజర్లకు యూపీఐ చెల్లింపులు మునుపటిలాగే పూర్తిగా ఉచితంగానే కొనసాగుతాయని ప్రభుత్వం పార్లమెంట్ వేదికగా కూడా భరోసా ఇచ్చింది. కాకపోతే ట్విస్ట్ ఏంటంటే బిజినెస్ చేసేవాళ్లు వీటిని వాళ్ల జోబులో నుంచి కట్టకుండా లాభాలు, మార్జిన్లను పెంచుకుని జనం నుంచి తిరిగి కలెక్ట్ చేస్తారు. అంటే పరోక్షంగా ప్రజలే దీనిని కడతారన్నమాట.