హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రైవేట్ మెడికల్ కాలేజీలు రూల్స్‌కు విరుద్ధంగా ఫీజులు గుంజుతున్నాయని, తల్లిదండ్రుల నుంచి ఇప్పటివరకు రూ.300 కోట్లకు పైగా దోచుకున్నాయని తెలంగాణ పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ మెడికల్ స్టూడెంట్స్ (పామ్స్) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మొత్తాన్ని వెంటనే విద్యార్థుల తల్లిదండ్రులకు రీఫండ్ చేయాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మల్లోజు సత్యనారాయణ చారి డిమాండ్ చేశారు. ఆరు నెలలుగా కేఎన్‌ఆర్‌యూహెచ్‌ఎస్, టీఏఎఫ్ఆర్సీ వద్ద ఆందోళనలు చేపట్టినా ఫలితం లేకపోవడంతోనే న్యాయస్థానాన్ని ఆశ్రయించామని తెలిపారు. ఆగస్టు 4న హైకోర్టు అదనంగా వసూలు చేసిన మొత్తాన్ని వెంటనే రీఫండ్ చేయాలని ఆదేశాలిచ్చినా యాజమాన్యాలు లెక్కచేయడం లేదని మండిపడ్డారు.
