మహబూబాబాద్/కాశీబుగ్గ, వెలుగు: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులపై అధికారులు వెంటనే స్పందించాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సూచించారు. గురువారం మహబూబాబాద్ కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన రివ్యూ మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల నియామకాలు, పదోన్నతులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలులో ఎలాంటి జాప్యం చేయవద్దన్నారు. ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలన్నారు.
ఎస్సీ, ఎస్టీలపై జరిగే అఘాయిత్యాలకు సంబంధించిన కేసుల విషయంలో పోలీసులు, రెవెన్యూ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. జిల్లాలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల పురోగతిపై సమీక్షించారు. ఎస్పీ శబరీష్, అడిషనల్కలెక్టర్ కె.అనిల్ కుమార్, కమిషన్ సభ్యులు నీలాదేవి, రాంబాబు నాయక్, లక్ష్మీనారాయణ, శంకర్ , ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్రీనివాసరావు, ఎస్టీ సంక్షేమ శాఖ అధికారి దేశీ రామ్ నాయక్, డీఆర్‌వో నాగలక్ష్మి, ఆర్డీవోలు రాజేశ్వరి, గణేశ్, జిల్లా సభ్యులు కిషన్ నాయక్, పంజా కల్పన, రజినీకుమార్, పాల్గొన్నారు.
కాశీబుగ్గ, వెలుగు: అనంతరం వరంగల్ కలెక్టరేట్‌లో కలెక్టర్ డాక్టర్ సత్య శారద, సీపీ శ్వేత, డీసీపీ అంకిత్ కుమార్, ఐటీడీఏ పీవో లెనిన్ వాత్సల్ టోప్పో, బల్దియా కమిషనర్ వెంకన్న తదితర రివ్యూ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఇచ్చిన ‘సమీకరించు.. బోధించు’ అనే సందేశాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఎస్సీ, ఎస్టీలకు తమ హక్కులపై అవగాహన కల్పించాలన్నారు.
