ఎవరు పార్టీ లైన్‌‌‌‌ ‌‌‌‌దాటినా చర్యలు తప్పవు:పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

ఎవరు పార్టీ లైన్‌‌‌‌ ‌‌‌‌దాటినా చర్యలు తప్పవు:పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
  • కొండా సుస్మిత వ్యాఖ్యలపై పీసీసీ చీఫ్‌‌‌‌ ‌‌‌‌మహేశ్​ ‌‌‌‌గౌడ్‌‌‌‌‌‌‌‌
  • మంత్రి కొండా సురేఖకు షోకాజ్‌‌‌‌‌‌‌‌ నోటీస్‌‌‌‌‌‌‌‌ ఇచ్చాం
  • ఆమె వివరణ తరువాత చర్యలు ఉంటాయి
  • టికెట్​ ఎవరికి ఇవ్వాలన్నది సీడబ్ల్యూసీ నిర్ణయం

నిజామాబాద్, వెలుగు: సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌ రెడ్డి, ఇతర కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ నాయకులపై మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలు అత్యంత బాధాకరమని పీసీసీ చీఫ్‌‌‌‌‌‌‌‌ మహేశ్​ ‌‌‌‌గౌడ్‌‌‌‌ అన్నారు. ఆమె వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. సుస్మిత కామెంట్లపై వివరణ కోరుతూ మంత్రి కొండా సురేఖకు షోకాజ్‌‌‌‌‌‌‌‌నోటీస్‌‌‌‌ ‌‌‌‌ఇచ్చామన్నారు. ఆమె నుంచి జవాబు వచ్చాక తదుపరి చర్యలు ఉంటాయన్నారు. 

ప్లానింగ్‌‌‌‌ ‌‌‌‌కమిషన్‌‌‌‌ ‌‌‌‌వైస్‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌ ‌‌‌‌చిన్నారెడ్డికి కూడా నోటీస్‌‌‌‌ ‌‌‌‌ఇచ్చినట్టు చెప్పారు. గురువారం ఆయన నిజామాబాద్‌‌‌‌‌‌‌‌లో మీడియాతో మాట్లాడారు. పార్టీ లైన్‌‌‌‌ ‌‌‌‌దాటి ఎవరు మాట్లాడినా క్రమశిక్షణ ఉల్లంఘన కిందకే వస్తుందని, ఈ విషయంలో ఎవరికీ మినహాయింపు ఉండదన్నారు. సుదీర్ఘ కాలంగా రాజకీయాల్లో ఉన్న కొండా సురేఖ, సీనియర్‌‌‌‌‌‌‌‌ నాయకుడైన చిన్నారెడ్డిపై అమితమైన గౌరవం ఉందని, పార్టీ విధానాలను ఉల్లంఘిస్తే యాక్షన్‌‌‌‌ తప్పదన్నారు. 

ఎవరికి వారే ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించుకోవడం తప్పేనని, ఎన్నికల్లో ఎవరికి అవకాశం ఇవ్వాలన్నది సీడబ్ల్యూసీ నిర్ణయిస్తుందన్నారు. పార్టీ అభ్యర్థులను ఎవరు ప్రకటించినా చెల్లదన్నారు. 22ఏ భూముల విషయంలో హరీశ్​​‌‌‌‌రావు, బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ ‌‌‌‌నాయకులు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని మహేశ్​విమర్శించారు. 
అధికారుల వల్ల జరిగిన పొరపాటును రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌‌‌‌రెడ్డి గుర్తించారని, ఎవరికీ నష్టం జరుగకుండా లోపాన్ని సరి చేశారన్నారు. 22ఏతో పేదల భూములకు ఎలాంటి నష్టం జరగదని, సర్కార్‌‌‌‌ భూములు అన్యాక్రాంతం కానివ్వమని అన్నారు. సామాన్యుడికి ఎలాంటి నష్టం వాటిల్లినా గాంధీ భవన్‌‌‌‌ తలుపు ‌‌తట్టాలని సూచించారు. 

ఎమ్మెల్యే పోచారంతో మాట్లాడినం..

కాంగ్రెస్ అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు బాన్సు‌‌వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌‌‌‌రెడ్డి పూర్తి మద్దతు ఇస్తున్నారని మహేశ్​‌‌గౌడ్‌‌ ‌‌అన్నారు. ఇటీవల ఆయన కామెంట్స్‌‌‌‌ గురించి మాట్లాడామని, ఆయన ఆవేదన తెలుసుకున్నామని చెప్పారు. బాన్సువాడ లో కొత్త, పాత కలయికతో ముందుకు వెళ్తామన్నారు. అంతకుముందు డీసీసీ ఆఫీస్‌‌‌‌లో జరిగిన రాజీవ్‌‌‌‌గాంధీ జయంతి వేడుకల్లో మహేశ్​గౌడ్​‌‌పాల్గొన్నారు. మల్లారం ఫారెస్ట్‌‌ ‌‌ఏరియాలో వనమహోత్సవ ప్రొగ్రామ్‌‌‌‌లో మొక్కలు నాటారు. మేయర్‌‌‌‌ ఉమారాణి, ఉర్దూ అకాడమీ చైర్మన్‌‌‌‌ తాహెర్‌‌‌‌ తదితరులు పాల్గొన్నారు.