టీచర్ భయానికి ఆగిన చిన్నారి గుండె.. సీసీ కెమెరాలో రికార్డ్

టీచర్ భయానికి ఆగిన చిన్నారి గుండె.. సీసీ కెమెరాలో రికార్డ్
  • వైజాగ్‌‌‌‌‌‌‌‌లో ఘటన..  సీసీ కెమెరాలో రికార్డ్
  • హోంవర్క్​చేయకపోవడమే తప్పయింది!
  • భయంభయంగా టీచర్​ముందుకు ఆరేండ్ల చిన్నారి
  • తనను కొట్టవద్దని ఏడుస్తూ ప్రాధేయపడిన స్టూడెంట్​
  • ముందుకు లాగి చెంపదెబ్బ కొట్టిన ఉపాధ్యాయురాలు
  • ఒక్కసారిగా గుండె ఆగి బాలుడి మృతి
  • ఏపీలోని వైజాగ్‌‌‌‌లో ఘటన..  

హైదరాబాద్,​ వెలుగు: హోంవర్క్  చేయకపోవడంతో ఎలాగైనా టీచర్​ కొడుతుందని యూకేజీ చదువుతున్న ఆ చిన్నారి భయపడ్డాడు. భయం భయంగా టీచర్​ముందుకు రాగా, ఆమె చిన్నారి చొక్కా పట్టి  లాగి, చెంప దెబ్బ కొట్టడంతో క్లాస్​రూమ్‌‌‌‌లోనే కుప్పకూలాడు. ఈ ఘటన ఏపీలోని వైజాగ్​లోని లిటిల్ గార్డెన్ స్కూల్‌‌‌‌లో జరిగింది. ఈ దుర్ఘటన మొత్తం క్లాస్‌‌‌‌ రూమ్‌‌‌‌లోని సీసీ కెమెరాలో రికార్డయ్యింది. 

గురువారం ఉదయం క్లాస్‌‌‌‌ రూమ్‌‌‌‌లో టీచర్ ​స్టూడెంట్ల హోంవర్క్​ పరిశీలిస్తోంది. అప్పటికే భయంతో వణికిపోతున్న ప్రణయ్ తేజ్(6) టీచర్​ ముందుకొచ్చాడు. చేతులు అడ్డంగా ఊపుతూ తనను కొట్టవద్దని ప్రాధేయపడినప్పటికీ, టీచర్​ చిన్నారి చొక్కా పట్టుకొని ముందుకు లాగి చెంపపై కొట్టింది. దీంతో చిన్నారి గుండె ఆగిపోవడంతో టీచర్‌‌‌‌‌‌‌‌పైనే కుప్పకూలాడు. 

టీచర్ ​తేరుకొని స్కూల్ ​యాజమాన్యం సహకారంతో సిటీలోని కింగ్ జార్జ్  హాస్పిటల్‌‌‌‌కు తరలించగా, అప్పటికే చనిపోయినట్టు డాక్టర్లు ప్రకటించారు. విషయం తెలిసి మృతుడి కుటుంబీకులు, బంధువులు హాస్పిటల్‌‌‌‌కు చేరుకొని ఆందోళనకు దిగారు. టీచర్  కొట్టడం వల్లే ప్రణయ్ తేజ్​చనిపోయాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్  చేశారు. కాగా, ఈ ఘటనపై ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్  స్పందించారు. విచారణ చేపట్టి స్కూల్‌‌‌‌ యాజమాన్యం, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.