పాక్ కాదు.. భవిష్యత్తులో భారత్‌కు అసలైన ముప్పు చైనాయే: నరవాణే

పాక్ కాదు.. భవిష్యత్తులో భారత్‌కు అసలైన ముప్పు చైనాయే: నరవాణే

భారత జాతీయ భద్రత, సరిహద్దుల సవాళ్లపై మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవాణే వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. తన కొత్త పుస్తక ఆవిష్కరణ సందర్భంగా మాట్లాడుతూ.. భవిష్యత్తులో దేశానికి ఎదురుకాబోయే అతిపెద్ద వ్యూహాత్మక సవాలు చైనానే అని స్పష్టం చేశారు. పాక్ ప్రోత్సహిస్తున్న ఉగ్రవాదం వల్ల ప్రస్తుతానికి మన దృష్టి ఆ దేశంపై ఎక్కువగా ఉన్నప్పటికీ.. లాంగ్ టర్మ్‌లో అన్ని రంగాల్లోనూ డ్రాగన్ దేశమే భారత్‌కు ప్రధాన ప్రత్యర్థి అని హెచ్చరించారు.

చైనా విషయంలో అత్యంత హుందాగా వ్యవహరించిన నరవాణే.. ఆ దేశాన్ని 'శత్రువు'గా అభివర్ణించేందుకు నిరాకరించారు. అదే సమయంలో సరిహద్దుల వద్ద మన బలగాల సత్తా ఏమాత్రం తగ్గకూడదని స్పష్టం చేశారు. ఎంత కష్టకాలమైనా చర్చల ద్వారానే సమస్యలను పరిష్కరించుకోవడానికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. బలాన్ని ప్రయోగించడం అనేది ఎప్పుడూ చివరి ఆప్షన్‌గా ఉండాలని అభిప్రాయపడ్డారు. అయితే ఎలాంటి దుస్సాహసానికైనా ధీటుగా బదులిచ్చేలా సైన్యం నిరంతరం అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.

నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, మయన్మార్ వంటి పొరుగు దేశాలతో మంచి సంబంధాలు కలిగి ఉండటం భారత్‌కు అత్యంత కీలకమని నరవాణే పేర్కొన్నారు. మనుషుల్లాగే దేశాలు కూడా తమ చుట్టుపక్కల ఉండే పొరుగువారిని ఎంచుకోలేవని, ఉన్న పరిస్థితుల్లోనే శాంతియుత వాతావరణాన్ని కాపాడుకోవాలని గుర్తుచేశారు. ఒకవేళ పొరుగు దేశాల్లో అశాంతి, హింస, శరణార్థుల సమస్య తలెత్తితే.. అది నేరుగా భారత దేశ భద్రతపై ప్రభావం చూపుతుందని, అక్రమ ఆయుధాల చొరబాటుకు దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.

ALSO READ : ఆప్షన్స్ ట్రేడింగ్‌లో 87.7 శాతం మందికి నష్టాలే.. చిన్న ట్రేడర్లే బలైపోతున్నరు!

ఒక దేశం శాంతిని కోరుకుంటే.. సరిగ్గా అదే సమయంలో యుద్ధానికి సైతం సర్వసన్నద్ధంగా ఉండాలనేది నరవాణే మాట. ఒక పక్క దౌత్యపరమైన చర్చలను కొనసాగిస్తూనే.. మరోపక్క బలమైన సైనిక నిరోధక శక్తిని ప్రదర్శించడం ద్వారానే దేశ రక్షణ సాధ్యమవుతుందని నరవాణే తన సుదీర్ఘ అనుభవంతో దేశ భవిష్యత్తు కోసం కీలక సూచనలు చేశారు.