శక్తితో ఫీజులు పెరగవు.. అపోహలు వద్దు: పాలిటెక్నిక్ విద్యార్థులతో మంత్రి వివేక్ వెంకటస్వామి

శక్తితో ఫీజులు పెరగవు.. అపోహలు వద్దు: పాలిటెక్నిక్ విద్యార్థులతో మంత్రి వివేక్ వెంకటస్వామి

ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 97, శక్తి (SHAKTI) ఫ్రేమ్‌వర్క్, పాలిటెక్నిక్ కళాశాలలను యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ (YISU) పరిధిలోకి తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తూ పాలిటెక్నిక్ విద్యార్థులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. శక్తి ఫ్రేమ్ వర్క్ పై అపోహలు తొలగించేందుకు, విద్యార్థులకు క్లారిటీ ఇచ్చేందుకు రంగంలోకి దిగారు కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. 

2026 ఆగస్టు 21న హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ పాలిటెక్నిక్ విద్యార్థులతో మాట్లాడిన మంత్రి వివేక్.. విద్యార్థుల సందేహాలను నివృత్తి చేశారు.  శక్తితో పాలిటెక్నిక్ విద్యార్థులకు ఇబ్బంది ఉండదని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. పాలిటెక్నిక్ విద్యార్థులక అండగా ఉంటామని హామీ ఇచ్చారు. పాలిటెక్నిక్ నుంచి ఇంజినీరింగ్ లోకి లాటరల్ ఎంట్రీ కొనసాగుతుందని తెలిపారు. 

పాలిటెక్నిక్ విద్యావ్యవస్థను మెరుగు పరుస్తున్నట్లు విద్యార్థులకు చెప్పారు. నిధుల లేమిపై విద్యార్థులు, అధ్యాపకుల నుంచి వస్తున్న ప్రశ్నలకు స్పందించిన మంత్రి.. నిధులు ఇప్పించే బాధ్యత తమదని..  పాలిటెక్నిక్ విద్యకు కార్మిక శాఖ నిధులు అందిస్తామని ఈ సందర్భంగా చెప్పారు. 

శక్తి ఫ్రేమ్ వర్క్ తో ఫీజులు పెరగవని ఈ సందర్భంగా మంత్రి చెప్పారు. శక్తితో ఎలాంటి నష్టం ఉండదన్నారు. శక్తిపై అపోహలు పెట్టుకోవద్దని విద్యార్థులకు సూచించారు. విద్యార్థులు, టీచర్ల సమస్యల పరిష్కారానికి ఎప్పుడూ సిద్ధమేనని తెలిపారు. జీవో 97 పై విద్యార్థుల ప్రశ్నలకు మంత్రి సమాధానం చెప్పారు. పాలిటెక్నిక్ కాలేజీలను యంగ్ ఇండియా అండర్ లోకి తీసుకురావడంపై విద్యార్థుల ఆందోళనలపై మంత్రి క్లారిటీ ఇచ్చారు.  ఈసెట్ పరీక్ష యాథావిథిగా ఉంటుందని తెలిపారు.