స్టాక్ మార్కెట్ అంటేనే చాలా మంది ఒక గ్యాంబ్లింగ్ గా భావిస్తుంటారు. వేలు పెడితే లక్షలు అవుతాయ్, లక్షలు కోట్లు అయిపోతాయ్ రోజుల్లో అని గాల్లో లెక్కలు కట్టి ఉన్నదంతా అందులో పెడుతుంటారు. కానీ మార్కెట్లు ఎవరిని రివార్డ్ చేస్తాయ్? ఎందుకు చేస్తాయ్ అనే లాజిక్ మాత్రం చాలా మంది మిస్ అవుతుంటారు. అందుకే స్టాక్ మార్కెట్లో ఈజీ మనీ కోసం వస్తున్నారు. ఆప్షన్స్ ట్రేడింగ్‌తో రాత్రికి రాత్రి కోట్లకు పడగలెత్తవచ్చని కలలు కంటున్నారు. అయితే ఈ షాకింగ్ నిజాలు మీరు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే.
స్టాక్ మార్కెట్ రెగ్యులేటరీ సంస్థ SEBI విడుదల చేసిన తాజా అధికారిక డేటా ప్రకారం.. దేశంలో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్(F&O) మార్కెట్లో ట్రేడింగ్ చేస్తున్న రిటైల్ ట్రేడర్లలో ఏకంగా 87.7 శాతం మంది భారీగా నష్టపోతున్నట్లు తేలింది. మార్కెట్లో ఏం జరుగుతుందో.. ట్రేడర్లు ఎలా డబ్బులు పోగొట్టుకుంటున్నారో ఇప్పుడు వివరంగా చూద్దాం రండి..
తగ్గిన ట్రేడర్లు.. మారని నష్టాల తీరు
FY26 సంవత్సరంలో ఈక్విటీ డెరివేటివ్స్ అంటే ఆప్షన్స్ ట్రేడింగ్ మార్కెట్లో పాల్గొనే వ్యక్తిగత ట్రేడర్ల సంఖ్య ఏడాది ప్రాతిపదికన 18 శాతం తగ్గి 87.5 లక్షలకు పడిపోయింది. మార్కెట్లో ట్రేడర్ల సంఖ్య తగ్గడంతో మొత్తం మీద పోయిన డబ్బులు అక్షరాలా రూ. లక్షా 11వేల 788 కోట్ల నుంచి రూ.91వేల 685 కోట్లకు తగ్గింది. అయితే ఇక్కడ అసలు మోసం వేరే ఉంది. ట్రేడర్లు తగ్గినాసరే.. ఒక్కో వ్యక్తి పోగొట్టుకున్న సగటు నష్టం మాత్రం రూ. లక్షా 14వేల నుంచి రూ. లక్షా 17వేలకు పెరిగిందట. అంటే తక్కువ మందే ట్రేడ్ చేసినా.. ఉన్నవాళ్లకు మాత్రం దెబ్బ గట్టిగా తగిలింది.
ఆప్షన్స్ ట్రేడింగే అసలైన డేంజరస్ జోన్
ట్రేడర్ల నష్టాలకు ప్రధాన కారణం F&O ట్రేడింగ్. FY26లో రిటైల్ ట్రేడర్లు కోల్పోయిన మొత్తం నష్టాల్లో ఏకంగా 92 శాతం కేవలం ఆప్షన్స్ వల్లే వచ్చాయి. ఆప్షన్స్ ట్రేడింగ్ చేసేవారిలో 87.7 శాతం మంది నష్టపోగా.. ఫ్యూచర్స్ ట్రేడింగ్ చేసేవారిలో ఈ నష్టపోయేవారు 66 శాతంగా ఉన్నారు. ముఖ్యంగా జీరో డేస్ టు ఎక్స్‌పైరీ అనగా ఎక్స్‌పైరీ రోజే ట్రేడ్ చేయడం, ఆప్షన్స్ కాంట్రాక్టుల గడువు ముగిసేలోపు రిస్క్ చేయడం వల్ల ట్రేడర్లు ఉన్నది మెుత్తం పోగొట్టుకుంటున్నారని తేలింది.
గెలుపు కంటే ఓటమే ఎక్కువ..
మార్కెట్లో విన్ అయ్యేవాళ్లు సగటున రూ. లక్షా 22వేలు సంపాదిస్తుంటే.. ఓడిపోయేవాళ్లు మాత్రం సగటున రూ.లక్షా 47వేలు కోల్పోతున్నారు. అంటే ప్రాఫిట్ కంటే లాస్ అమౌంట్ 21 శాతం ఎక్కువగా ఉంది. దీనికి తోడు బ్రోకరేజ్, సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్, జీఎస్‌టీ రూపంలో ట్రేడర్లు భారీగా చెల్లిస్తూ నష్టాలకు కూడా భారీగా సమర్పించుకుంటున్నారు ఛార్జీల రూపంలో. ట్రేడింగ్ టర్నోవర్ తగ్గినప్పటికీ.. ఎస్టీటీ పెరగడంతో ఒక్కో ట్రేడర్‌పై సగటు ట్రాన్సాక్షన్ కాస్ట్ రూ. 31వేల 628కి చేరింది. నష్టపోయిన ట్రేడర్ల గ్రాస్ లాస్‌లో ఈ కాస్ట్ సుమారు 35 శాతంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది.
చిన్న పోర్ట్‌ఫోలియో ఉన్నవారికే ఎక్కువ రిస్క్
సెబీ స్టడీ ప్రకారం.. చిరు వ్యాపారులు, చిన్న ఇన్వెస్టర్లే ఎక్కువగా బలైపోతున్నారట స్టాక్ మార్కెట్లో. ఎలాంటి ఈక్విటీ పోర్ట్‌ఫోలియో లేనివారు లేదా రూ. లక్షకంటే తక్కువ ఈక్విటీ హోల్డింగ్స్ ఉన్నవారు ఏకంగా 70 శాతం నష్టాలను మూటకట్టుకున్నారంట. ముఖ్యంగా 30 సంవత్సరాల వయసు లోపు ఉన్న యువకుల్లో 89 శాతం మంది డబ్బులు పోగొట్టుకుంటున్నారు. అలాగే రూ. 5 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్న వారు ఎక్కువగా ఈ ఉచ్చులో చిక్కుకుంటున్నారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి.
సెబీ ఎన్ని నిబంధనలు తెచ్చినా, వీక్లీ కాంట్రాక్టులను పరిమితం చేసినా ట్రేడర్ల తీరు మారడం లేదు. రాత్రికి రాత్రి డబ్బు సంపాదించాలనే ఆశతో చిన్న ట్రేడర్లు కూడా అధిక నష్టాల రిస్క్ ఉండే ఆప్షన్స్ ట్రేడింగ్‌లో దిగి డబ్బులు పెట్టి సర్వస్వం కోల్పోతున్నారు. మార్కెట్ లాభాల అందమైన ప్రపంచాన్ని చూసి మోసపోకుండా.. రిస్క్ మేనేజ్‌మెంట్ లేకుండా ట్రేడింగ్ చేయడం ఎంత ప్రమాదకరమో ఈ లెక్కలే చెబుతున్నాయి.
