- కేంద్రంతోపాటు చంద్రబాబు సర్కారుకు మంత్రి తుమ్మల విజ్ఞప్తి
హైదరాబాద్, వెలుగు: ఏపీలోని ఐదు పంచాయతీలను తెలంగాణలో విలీనం చేయాలని కోరుతూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, ఏపీ సీఎం చంద్రబాబుకు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు వేర్వేరుగా వినతిపత్రాలు సమర్పించారు. గురువారం ఆయన తమిళనాడులోని మహాబలిపురంలో జరిగిన సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి పాల్గొన్నా రు.
భద్రాచలం చుట్టుపక్కల ఉన్న యటపాక, కన్నాయిగూడెం, పిచ్చికలపాడు, పురుషోత్తపట్నం, గుండాల గ్రామ పంచాయతీలతో పాటు వాటి పరిధిలోని 19 రెవెన్యూ గ్రామాలను భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విలీనం చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని తుమ్మల కోరారు. ఈ ప్రాంతాలు ఏపీలో కొనసాగుతుండటం వల్ల పరిపాలనా, రవాణా పరంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.
ఈ ప్రాంతాలను తెలంగాణలో కలిపితే పరిపాలన మరింత చేరువవుతుందని తెలిపారు. పురుషోత్తపట్నంలో భద్రాచలం దేవాలయం భూములు ఉండటం వల్ల వస్తున్న సమస్యలను కూడా వివరించారు.అలాగే, 2024 జూలైలో భారీ వర్షాలకు దెబ్బతిన్న అశ్వారావుపేట మండలంలోని పెద్దవాగు ప్రాజెక్టును పునరుద్ధరించేందుకు అవసరమైన రూ.92.20 కోట్లలో ఏపీ ప్రభుత్వం తన వాటా నిధులను విడుదల చేయాలని మంత్రి తుమ్మల కోరారు.
అంతర్జాతీయ క్రూడ్ పామ్ ఆయిల్ ధరల హెచ్చుతగ్గుల నుంచి రైతులను ఆదుకునేందుకు ఆయిల్‌పామ్ గెలలకు టన్నుకు రూ.25 వేల కనీస హామీ ధర నిర్ణయించేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని చంద్రబాబుగకు విజ్ఞప్తి చేశారు. అలాగే, రాష్ట్ర విభజన సమస్యలకు, అంతర్రాష్ట్ర చిక్కులకు శాశ్వత పరిష్కారం చూపించడమే లక్ష్యంగా ఈ అంశాలను సదరన్ జోనల్ కౌన్సిల్ వేదికపై ప్రస్తావించినట్లు మంత్రి తుమ్మల పేర్కొన్నారు.
