- హైదరాబాద్ డీఐఈఓ ఒడ్డెన్న, రంగారెడ్డి డీఐఈఓ ఎంక్యా నాయక్‌కు షోకాజ్
- ‘వెలుగు’ కథనంపై స్పందించిన బోర్డు సెక్రటరీ అభిలాష అభినవ్
హైదరాబాద్, వెలుగు: ప్రైవేట్ కాలేజీల అఫిలియేషన్ కోసం ఫేక్ ఎన్‌ఓసీల దందాపై ఇంటర్ బోర్డు చర్యలు మొదలుపెట్టింది. నకిలీ పత్రాలు పెట్టిన కాలేజీలకు అండగా నిలిచారనే ఆరోపణలపై ఇద్దరు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారులకు (డీఐఈఓ) షోకాజ్ నోటీసులిచ్చింది. హైదరాబాద్ డీఐఈఓ ఒడ్డెన్న, రంగారెడ్డి డీఐఈఓ ఎంక్యా నాయక్‌కు బోర్డు సెక్రటరీ అభిలాష అభినవ్ నోటీసులు పంపారు.
కాలేజీలు సమర్పించిన పత్రాలు ఫేక్ అని తెలిసినా.. వాటిని అఫిలియేషన్ కోసం బోర్డుకు ఎందుకు ఫార్వర్డ్ చేశారో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. వారం రోజుల క్రితం వెలుగు దినపత్రికలో ‘ఫేక్ ఎన్‌ఓసీల దందాకు అధికారుల అండా’ అనే శీర్షికతో ప్రచురితమైన కథనంపై బోర్డు అధికారులు స్పందించారు. కాలేజీల్లో తనిఖీలు సరిగా ఎందుకు చేయలేదని, ఫైర్ సేఫ్టీ, స్ట్రక్చరల్ స్టెబిలిటీ వంటి కీలక సర్టిఫికెట్లను కనీసం వెరిఫై చేయకుండా ఫైళ్లను ఎలా పంపించారో చెప్పాలని నోటీసుల్లో ప్రశ్నించినట్లు తెలిసింది.
రెండో లిస్టులో బోర్డు అధికారులు
తొలి విడతలో డీఐఈఓలకు నోటీసులివ్వగా.. రెండో విడతలో ఇంటర్ బోర్డు ప్రధాన కార్యాలయంలోని మరికొందరు అధికారులకు కూడా నోటీసులిచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. డీఐఈఓలు పంపిన ఫైళ్లను బోర్డులో సరిగ్గా స్క్రూటినీ చేయకుండా ఎవరు ఆమోదించారనే కోణంలో విచారణ జరుగుతున్నది. డీఐఈఓలు ఇచ్చే వివరణ ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని, తప్పు చేసినవారు ఎవరైనా ఉపేక్షించేది లేదని బోర్డు సెక్రటరీ అభిలాష అభినవ్ ‘వెలుగు’తో స్పష్టం చేశారు. వచ్చే ఏడాది నుంచి సర్టిఫికెట్లను ఆన్‌లైన్‌లోనే వెరిఫికేషన్ చేసేలా ప్లాన్ చేస్తున్నామని వెల్లడించారు.
