మూగ జీవాల మధ్య అనుబంధం ఒక్కో సారి ఆశ్చర్యానికి గురిచేస్తుంటుంది. ఒకే జాతి మనుషుల మధ్య కూడా ఉండని స్నేహం.. వేర్వేరు జాతుల మధ్య ఎలా ఏర్పడుందా అనే విధంగా వాటి మధ్య అనుబంధం ఏర్పడుతుంది. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్ పెట్ లో ఆవుదూడ, కోతి మధ్య ఏర్పడిన బంధం గ్రామస్తులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
అడవుల్లో నుంచి ఆ ఊరు ఈ ఊరు దాటుతూ వచ్చిన కోతి.. ఆవు దూడతో స్నేహంగా ఉండటం ప్రారంభించింది. రోజూ ఆవు దూడను ఆటపట్టిస్తూ.. దానితో ఆడుకుంటూ సరదాగా గడిపేది. చివరికి అదే వాటి మధ్య అనుబంధంగా మారింది. దీంతో ఆవు దూడను కనిపెట్టుకునే కోతి తిరుగుతోంది.
గత15 రోజులుగా ఆవు దూడపై కోతి తిరుగుతోంది. దూడ ఉదయం మేతకు వెళ్లినప్పుడు దానితో పాటు అటవీ ప్రాంతానికి వెళ్తోంది. సాయంత్రం ఇంటికి చేరుకున్న తర్వాత కాసేపు దూడతో ఆడుకుని.. ఆ తర్వాత సమీపంలోని చెట్లపై ఉంటోంది. భిన్నజాతులైన ఈ రెండు మూగజీవాల అనుబంధం గ్రామస్తులను ఆకట్టుకుంటోంది.
