చిరంజీవి - బాలకృష్ణ మల్టీస్టారర్‌పై బోయపాటి బిగ్ హింట్.. ఒకే తెరపై కనిపిస్తే ఫ్యాన్స్ కు పూనకాలే!

చిరంజీవి - బాలకృష్ణ మల్టీస్టారర్‌పై బోయపాటి బిగ్ హింట్.. ఒకే తెరపై కనిపిస్తే ఫ్యాన్స్ కు పూనకాలే!

తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలకృష్ణకు ఉన్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరి సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయంటే అభిమాపేలకు పూనకాలే. అలాంటిది ఈ వీరిద్దరు కలిసి ఓ సినిమాలో నటిస్తే .. ఆ క్రేజ్ ఏ స్థాయిలో ఉంటుందో ఊహించలేం. బాక్సాఫీస్ షేక్ కావాల్సిందే . ఇప్పుడు ఈ క్రేజీ కాంబినేషన్ పై దర్శకుడు బోయపాటి శ్రీను మరోసారి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడంతో టాలీవుడ్ హాట్ టాపిక్ గా మారింది.

ఈ రోజు ( అక్టోబర్ 5, 2026 ) తిరుమల శ్రీవారిని కుటుంబ సభ్యులతో కలసి దర్శించుకున్న బోయపాటి శ్రీను.. ఏదైన కొత్త ప్రాజెక్టు ప్రారంభించడానికి ముందు శ్రీవారి ఆశీస్సులు తీసుకోవడం తనకు అనవాయితీ అని చెప్పారు. ఈ నెలాఖరులోపల తన నూతన ప్రాజెక్టును ప్రకటించనున్నట్లు వెల్లడించారు. దీంతో బోయపాటి నెక్ట్స్ సినిమా ఏ హీరోతో ఉండబోతోందన్న ఆసక్తి మరింత పెరిగింది.

ఇదే సమయంలో.. చిరంజీవి – బాలకృష్ణల మల్టీస్టారర్‌పై కూడా బోయపాటి కీలక వ్యాఖ్యలు చేశారు. అవకాశం వస్తే ఈ ఇద్దరు లెజెండ్స్‌తో కలిసి సినిమా చేయడం కచ్చితంగా జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ ఇద్దరి ఇమేజ్, స్టార్‌డమ్‌ను దృష్టిలో పెట్టుకుని కథ, పాత్రలు, డేట్స్, షూటింగ్ ప్లాన్ వంటి అంశాలను పక్కాగా సిద్ధం చేసుకోవాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జునలను తెలుగు సినిమా స్తంభాలుగా అభివర్ణించిన బోయపాటి.. వారిలో ఇద్దరు లెజెండ్స్‌ను ఒకే సినిమాలో చూపించే అవకాశం వస్తే అది తనకు గౌరవంగా భావిస్తానని చెప్పారు. ఇటీవల నందమూరి బాలకృష్ణ సినీ ప్రస్థానంలో 50 ఏళ్ల వేడుకల సందర్భంగా చిరంజీవి స్వయంగా బోయపాటికి ఈ కాంబినేషన్‌పై ఛాలెంజ్ విసరడం తెలిసిందే. అప్పటి నుంచి ఈ కాంబోపై ఊహాగానాలు మరింత ఊపందుకున్నాయి. ఇప్పుడు బోయపాటి మాటలు ఆ అంచనాలకు మరింత బలం చేకూర్చాయి. 

అంతే కాదు.. బాలయ్యతో 'అఖండ 3' కూడా తప్పకుండా ఉంటుందని బోయపాటి స్పష్టం చేశారు.  సరైన సమయంలో బాలకృష్ణతో కలిసి ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను ప్రకటిస్తామని తెలిపారు. దీంతో బోయపాటి ఒకవైపు బాలయ్యతో 'అఖండ 3'పై ఫోకస్ చేస్తూనే.. మరోవైపు చిరు–బాలయ్య కాంబోను తెరపైకి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారా? అనే చర్చ మొదలైంది.

ప్రస్తుతం ఈ మల్టీస్టారర్‌పై ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోయినా.. బోయపాటి ఇచ్చిన హింట్ మాత్రం అభిమానుల్లో కొత్త ఆశలు రేపుతోంది. నిజంగానే చిరు, బాలయ్య ఒకే తెరపై కనిపిస్తే ఫ్యాన్స్ పూనకాలే... మరి ఈ మల్టీస్టారర్ చిత్రం పట్టాలపై కార్యరూపం దాల్చుతుందో లేదో చూడాలి.