- ప్రతిష్టాత్మక యూనివర్సిటీల ప్రతినిధులతో సమావేశాలు
- ఫ్యూచర్ సిటీలో క్యాంపస్‌ల ఏర్పాటుపై చర్చ
- కూతురు కాలేజీ అడ్మిషన్ కోసం అమెరికాకు వెళ్లిన కేటీఆర్
- అక్బరుద్దీన్ బిడ్డ పెండ్లికి లండన్ పోయిన హరీశ్ రావు
హైదరాబాద్, వెలుగు: రాజకీయాల్లో నిత్యం వార్తల్లో నిలిచే అధికార, ప్రతిపక్షాల అగ్రనేతలంతా ఒక్కసారిగా విదేశీ బాట పట్టారు. సీఎం రేవంత్ రెడ్డితోపాటు ప్రతిపక్ష బీఆర్ఎస్ కీలక నేతలు కేటీఆర్, హరీశ్ రావు వేర్వేరు కారణాలతో విదేశీ పర్యటనలకు వెళ్లారు. అధికారిక, వ్యక్తిగత పనుల కోసం ముఖ్యనేతలంతా ఒకే సమయంలో విదేశాలకు వెళ్లడంతో రాష్ట్రంలో రాజకీయ కార్యకలాపాలు కాస్త చల్లబడ్డాయి. రాష్ట్రంలో విద్యావ్యవస్థను చక్కదిద్ది పటిష్టపరచాలనే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి లండన్, అమెరికా పర్యటనకు వెళ్లారు. అటు అధికారిక పర్యటనలతోపాటు ఇటు పార్టీ కార్యకలాపాల్లోనూ పాల్గొననున్నారు.
ఆయా దేశాల్లోని ప్రతిష్టాత్మక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, కేంబ్రిడ్జి యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ లండన్, లండన్ బిజినెస్ స్కూల్, అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీ, మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ఆఫ్ టెక్నాలజీ, నార్త్ ఈస్టర్న్ క్యాంపస్, వర్జీనియా టెక్ యూనివర్సిటీలను సీఎం సందర్శించనున్నారు. అక్కడి అధికారులతో సమావేశమై.. హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఫ్యూచర్ సిటీలో యూనివర్సిటీ బ్రాంచ్‌లను ఏర్పాటు చేయాలని కోరనున్నారు. తద్వారా రాష్ట్రంలో ఉన్నత చదువులను అంతర్జాతీయ స్థాయికి చేర్చేందుకు మార్గం వేయనున్నారు. యూనివర్సిటీల పర్యటనల తర్వాత అమెరికాలో కాంగ్రెస్ ఓవర్సీస్ బృందం ఏర్పాటు చేసిన సమావేశాల్లో సీఎం పాల్గొననున్నారు.
కూతురు చదువుల కోసం..
బీఆర్ఎస్వర్కింగ్ ప్రెసిడెంట్కేటీఆర్ కూడా15 రోజులపాటు కుటుంబంతో కలిసి అమెరికా పర్యటనకు వెళ్లారు. తన కూతురు ఉన్నత చదువుల కోసం కాలేజీ అడ్మిషన్ కు ఆయన వెళ్లారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వర్జీనియా టెక్యూనివర్సిటీలో సీటు రావడంతో కుటుంబంతో కలిసి అమెరికా వెళ్లినట్టు తెలిసింది. దీంతోపాటు పార్టీ ఓవర్సీస్ నేతలు ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లోనూ పాల్గొంటారని సమాచారం. దీంతో ఆయన కూడా ఈ నెలాఖరుదాకా అక్కడే ఉండే అవకాశాలున్నాయి.
అక్బరుద్దీన్ కూతురు పెండ్లి కోసం..
ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ తన కూతురు పెండ్లి లండన్‌లో చేస్తున్నారు. దీంతో ఎంఐఎం నేతలతోపాటు పలువురు అధికార ప్రతిపక్ష నేతలు లండన్‌కు వెళ్లారు. హరీశ్ రావు బుధవారం రాత్రే లండన్ వెళ్లారు. అక్కడ పెండ్లికి అటెండ్ అయ్యి.. శుక్రవారం రాత్రికి లండన్ నుంచి తిరుగు ప్రయాణం కానున్నారు. మంత్రి అజారుద్దీన్ కూడా అక్బరుద్దీన్ బిడ్డ పెండ్లి కోసం లండన్ వెళ్లారు. ఇటు అధికార, ప్రతిపక్షాల నేతలు ఒకేసారి విదే శీ పర్యటనలకు వెళ్లడం ఆసక్తికరంగా మారింది.
