మంచిర్యాల జిల్లాలో పోకిరీల ఆట కట్టు.. డ్రోన్ కెమెరాతో నిఘా.. 13 మందిపై కేసులు

మంచిర్యాల జిల్లాలో పోకిరీల ఆట కట్టు.. డ్రోన్ కెమెరాతో నిఘా.. 13 మందిపై కేసులు

మంచిర్యాల జిల్లాలో డ్రోన్ నిఘాతో  పోకిరీల ఆట కట్టిస్తున్నారు పోలీసులు. ఈవ్‌టీజింగ్, బహిరంగ మద్యపానం, మాదకద్రవ్యాల  వినియోగం మొదలైన చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు చెక్ పెడుతున్నారు.  రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా ఆదేశాల మేరకు ప్రజలకు ప్రశాంతమైన, సురక్షిత వాతావరణం కల్పించడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నారు. మంచిర్యాల పట్టణం, నస్పూర్, శ్రీరాంపూర్ ప్రాంతాల్లో మంచిర్యాల డీసీపీ ఎ.భాస్కర్ ఆధ్వర్యంలో ప్రత్యేక డ్రోన్ నిఘా ఆపరేషన్ నిర్వహించారు. 

పాఠశాలలు, బాలికల వసతి గృహాలు, కళాశాలల పరిసరాలు, గోదావరి నది తీర ప్రాంతాలు, మైదానాలు తదితర ప్రాంతాల్లో బహిరంగంగా మద్యం సేవించడం, ఈవ్‌టీజింగ్‌కు పాల్పడటం, యువతను ఇబ్బందులకు గురిచేయడం, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.

రాజీవ్‌నగర్‌లోని గర్ల్స్ మోడల్ స్కూల్,  సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ గర్ల్స్ స్కూల్ పరిసర ప్రాంతాలు, ఎఫ్‌సీఐ గోదాం ప్రాంతం, కాలేజీ రోడ్డు,గోదావరి నది తీర ప్రాంతాలు, అలాగే మంచిర్యాల, నస్పూర్, శ్రీరాంపూర్ పరిధిలోని మైదానాల్లో డ్రోన్ కెమెరాల ద్వారా నిఘా నిర్వహించారు. డ్రోన్ విజువల్స్ ఆధారంగా బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న 13 మందిని అదుపులోకి తీసుకుని వారిపై కేసులు నమోదు చేశారు. ఈవ్‌టీజింగ్, అనుమానాస్పదంగా సంచరించడం, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు అవసరమైన వారికి కౌన్సెలింగ్ నిర్వహించారు.

బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, మద్యం సేవించి ప్రజలకు ఇబ్బందులు కలిగించడం, అసభ్యంగా ప్రవర్తించడం, గొడవలకు పాల్పడటం, మహిళలు, విద్యార్థినులను వేధించడం వంటి చర్యలకు పాల్పడితే కేసులు నమోదు చేసి చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.ప్రజల భద్రతకు విఘాతం కలిగించే విధంగా ఎవరైనా వ్యవహరిస్తే ఎలాంటి ఉపేక్ష ఉండదని స్పష్టం చేశారు.చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులు పోలీసుల నిఘా నుంచి తప్పించుకోలేరని డీసీపీ తెలిపారు.