500 మంది స్టూడెంట్లకు సైకిళ్ల పంపిణీ...కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ స్కూళ్ల నిర్వహణ : రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్

500 మంది స్టూడెంట్లకు సైకిళ్ల పంపిణీ...కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ స్కూళ్ల నిర్వహణ : రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్
  •     రామగుండంలో రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్​ స్కూల్​
  •     ఎమ్మెల్యే ఎంఎస్​ రాజ్​ఠాకూర్

గోదావరిఖని, వెలుగు: విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్ల వైపు వెళ్లకుండా ప్రభుత్వ బడుల్లోనే కార్పొరేట్​ స్థాయిలో నాణ్యమైన విద్య అందించేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్​ రాజ్​ఠాకూర్​ అన్నారు. ఎన్టీపీసీ సంస్థ సామాజిక బాధ్యత కార్యక్రమం కింద మండల పరిధిలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థినులకు సమకూర్చిన 500 సైకిళ్లను గురువారం గోదావరిఖనిలోని బాలికల హైస్కూల్ ​వద్ద ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను గతంలో ఎన్నడూ లేనివిధంగా అభివృద్ధి చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోందన్నారు. 

రామగుండం నియోజకవర్గాన్ని విద్యా కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని, ఇందులో భాగంగా పట్టణంలో 26 ఎకరాల్లో రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్​ స్కూల్​ను నిర్మించనున్నట్లు తెలిపారు. ఎన్టీపీసీ సంస్థ సామాజిక బాధ్యతగా విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ చేపట్టడం అభినందనీయమన్నారు. అంతకుముందు మాజీ ప్రధాని రాజీవ్​ గాంధీ జయంతి సందర్భంగా గోదావరిఖని జీఎం ఆఫీస్​ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయా కార్యక్రమాల్లో  మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతిపల్లి ఎల్లయ్య, ఎంఈవో మల్లేశ్, కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అధ్యక్షుడు బొంతల రాజేశ్, కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు.