- గాంధీ కుటుంబంపై బురదజల్లే కుట్ర
కరీంనగర్, వెలుగు: స్వాతంత్రోద్యమంతో సంబంధంలేని బీజేపీ పార్టీ.. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన గాంధీ కుటుంబంపై బురదజల్లే ప్రయత్నం చేస్తోందని కరీంనరగ్ సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మండిపడ్డారు. సోనియా గాంధీ, మల్లిఖార్జున ఖర్గేపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను నరేందర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. తన క్యాంపు ఆఫీస్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 1950లో భారత జాతీయ కాంగ్రెస్ వందేమాతరం గీతాన్ని జాతీయ గీతంగా ఆమోదించిందని గుర్తుచేశారు.
1951లో ఆవిర్భవించిన జనసంఘ్ 1980లో బీజేపీగా మారిందని, అలాంటి బీజేపీకి కాంగ్రెస్ను, ఆ పార్టీ నాయకులను విమర్శించే హక్కు లేదన్నారు. రెండుసార్లు ప్రధాన మంత్రిగా అవకాశం వచ్చినా సున్నితంగా సోనియా గాంధీ తిరస్కరించారని, ఓటమెరుగని నిబద్ధతగల ప్రజా నాయకులు మల్లికార్జున ఖర్గే అని నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాల ఇస్తా అన్న మోడీ హామీ ఏమైందని ప్రశ్నించారు. సమావేశంలో పర్వతం మల్లేశం, శ్రీనివాస్ రెడ్డి, కుర్ర పోచయ్య, జీడి రమేశ్, ముక్క భాస్కర్, లయక్, కృష్ణారెడ్డి, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
