హైదరాబాద్, వెలుగు: స్కూల్ స్థాయి క్రీడల్లో నకిలీ సర్టిఫికెట్ల దందాకు చెక్ పెడుతూ విద్యాశాఖ డిజిటల్ విధానానికి శ్రీకారం చుట్టింది. ఇకపై విద్యార్థులు పాల్గొనే క్రీడలు, సాధించిన విజయాల వివరాలను మండలం నుంచి జాతీయ స్థాయి వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేయనున్నారు. గురువారం హైదరాబాద్‌లోని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్‌లో అన్ని జిల్లాల స్కూల్ గేమ్స్ ఆర్గనైజింగ్ సెక్రటరీలతో స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ సమావేశమయ్యారు. మెదక్ జిల్లాకు సంబంధించిన స్కూల్ గేమ్స్ వెబ్ పోర్టల్‌ను ఆయన ప్రారంభించారు.
ఆన్‌లైన్ నమోదుతో క్రీడా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ సులభమవుతుందని, నకిలీ సర్టిఫికెట్లతో ప్రయోజనం పొందాలనుకునే వారికి ఇకపై అవకాశం ఉండదని నికోలస్ చెప్పారు. ప్రతి విద్యార్థి క్రీడా రికార్డు డిజిటల్ రూపంలో భద్రంగా ఉంటుందన్రు. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి 70వ రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ టోర్నమెంట్లు, సెలక్షన్ల నిర్వహణపై డైరెక్టర్ అధికారులతో చర్చించారు. స్కూల్ స్థాయి క్రీడలే భవిష్యత్ అంతర్జాతీయ క్రీడాకారులకు పునాదులని, విద్యార్థుల్లోని ప్రతిభను గుర్తించి వారిని జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యమని చెప్పారు. పోటీల నిర్వహణలో జిల్లా సెక్రటరీల పాత్ర కీలకమని, క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయాలని నవీన్ నికోలస్ సూచించారు.
