ఎస్బీఐ ఖాతాదారులపై మరో ఛార్జీ .. బ్రాంచుకు వెళ్లి డబ్బు విత్డ్రా చేసుకుంటే ఛార్జీ కట్టాల్సిందే

ఎస్బీఐ ఖాతాదారులపై మరో ఛార్జీ .. బ్రాంచుకు వెళ్లి డబ్బు విత్డ్రా చేసుకుంటే ఛార్జీ కట్టాల్సిందే
  • ఒక్కో లావాదేవీపై  రూ.15+ జీఎస్‌‌టీ
  • నెలలో నాలుగు సార్లే ఉచితం

ముంబై: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌‌బీఐ) తమ బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ (బీఎస్‌‌బీడీ) ఖాతాదారుల నగదు విత్‌‌డ్రాయల్ రూల్స్​ మార్చింది. బ్రాంచ్‌‌కు వెళ్లి క్యాష్ కౌంటర్ దగ్గర చేసే విత్‌‌డ్రాయల్స్‌‌పై ఇకనుంచి ఛార్జీలు వేయనుంది. ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి ఇది  అమల్లోకి వస్తుంది.  

ఖాతాదారులు  నెలలో బ్యాంకు బ్రాంచ్‌‌కు వెళ్లి ఉచితంగా 4 సార్లు మాత్రమే నగదు విత్‌‌డ్రా చేసుకోవచ్చు. ఆ  తర్వాత చేసే ప్రతి విత్‌‌డ్రాయల్‌‌పై రూ.15 తో పాటు జీఎస్‌‌టీ (జీఎస్‌‌టీ) అదనపు ఛార్జీగా వసూలు చేస్తారు. ఉదాహరణకు: ఒక నెలలో బ్రాంచ్ ద్వారా 6 సార్లు నగదు తీసుకుంటే.. మొదటి 4 ఉచితం కాగా, 5వ,  6వ విత్‌‌డ్రాయల్స్‌‌కు ఒక్కోదానికి రూ.15 +జీఎస్‌‌టీ పడుతుంది. 

మరోవైపు యూపీఐ, నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ వంటి డిజిటల్ లావాదేవీలపై ఎలాంటి పరిమితులు లేవు.  వాటికి ఎటువంటి ఛార్జీలు వర్తించవు. ప్రస్తుతం ప్రధాన బ్యాంకుల్లో ఎస్‌‌బీఐ మాత్రమే ఈ ఛార్జీలను ప్రకటించింది. అదే ఏటీఎంల విషయానికొస్తే బ్యాంక్ ఏటీఎంలో అయితే నెలకు 5 లావాదేవీలు ఉచితం. ఇతర బ్యాంకుల ఏటీఎంలలో అయితే నాన్ మెట్రోల్లో 5, మెట్రోల్లో 3 లావాదేవీలు ఉచితం.