తెలంగాణలో 7వేల629 బడుల్లో 30లోపే స్టూడెంట్లు

తెలంగాణలో  7వేల629 బడుల్లో 30లోపే స్టూడెంట్లు
  • 31 నుంచి వందలోపు మరో 9,785 స్కూళ్లు
  • వివరాలు వెల్లడించిన స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్
  • సర్కారు స్కూళ్లన్నింటికీ రూ.64 కోట్ల గ్రాంట్ రిలీజ్

హైదరాబాద్, వెలుగు: సర్కారు బడుల్లో విద్యార్థుల గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా రిలీజ్ చేసిన లెక్కల్లో ఎక్కువ బడుల్లో తక్కువ మంది విద్యార్థులు చదువుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 23,198 సర్కారు బడుల్లో విద్యార్థుల వివరాలు వెల్లడించారు. కేవలం 30లోపు విద్యార్థులున్న బడులు రాష్ట్రంలో 7,629 ఉండగా, 31 నుంచి వందలోపు విద్యార్థులు ఉన్నవి 9,785 స్కూళ్లు ఉన్నాయి. 

రాష్ట్రంలోని మొత్తం బడుల్లో దాదాపు 75 శాతం కేవలం వందలోపు విద్యార్థులతో మాత్రమే కొనసాగుతున్నాయి. 101 నుంచి 250 వరకూ విద్యార్థులున్న స్కూళ్లు 4,287 ఉండగా, 250 కంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉన్న బడులు రాష్ట్రవ్యాప్తంగా కేవలం 1,497 మాత్రమే ఉండటం గమనార్హం. అయితే, దీంట్లో వెయ్యిలోపు ఉన్న స్కూళ్లు 28 మాత్రమే ఉన్నాయి. అయితే, 30లోపు విద్యార్థులున్న బడుల్లో హైస్కూళ్లు 160 ఉండగా, మిగిలిన 7,469 ప్రైమరీ బడులున్నాయి.

రూ.64.82 కోట్ల నిధులు విడుదల..

రాష్ట్రంలోని సర్కారు బడుల నిర్వహణ కోసం ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. 2026–27 విద్యాసంవత్సరానికి కాంపోజిట్ స్కూల్ గ్రాంట్ కింద మొత్తం రూ.64.82 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులను హెడ్ మాస్టర్లు, ఎంఈవోలు, డీఈవోల పరిధిలోని ఎస్ఎన్ఏ స్పర్శ్ అకౌంట్లలో జమ చేయనున్నారు. వీటిని స్కూల్ మెయింటెనెన్స్, ల్యాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, లైబ్రరీల నిర్వహణ, తాగునీరు, విద్యుత్ బిల్లుల చెల్లింపు వంటి అవసరాలకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే, సున్నా ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ ఉన్న స్కూళ్లు, పీఎంశ్రీ బడులకు ఈ గ్రాంట్లు వర్తించవని ప్రభుత్వం స్పష్టం చేసింది.

స్లాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల వారీగా నిధులు..

విద్యార్థుల సంఖ్య ఆధారంగా స్కూళ్లకు నిధులను కేటాయించారు. 30లోపు విద్యార్థులున్న బడులకు రూ.10 వేలు, వందలోపు ఉన్న వాటికి రూ.25 వేలు, 250లోపు ఉంటే రూ.50 వేల చొప్పున గ్రాంట్ ఇస్తున్నారు. వెయ్యి కంటే ఎక్కువ మంది విద్యార్థులున్న 28 స్కూళ్లకు రూ.లక్ష చొప్పున నిధులు అందనున్నాయి.