నల్గొండ, వెలుగు: ప్రతీ మనిషికి ఆధార్ చాలా ముఖ్యమని, అందుకు ఆధార్ లో ఏమైనా సవరణలు, సమస్యలుంటే పరిష్కరించుకునేందుకు నల్గొండ జిల్లా కేంద్రంలో ఆధార్ సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేశామని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. నల్గొండ జిల్లా కేంద్రంలో కేంద్ర యూఐడీఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆధార్ సేవా కేంద్రాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నల్గొండ జిల్లా కేంద్రంలో ఆధార్ సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం సంతోషమని, తెలంగాణలో ఇది 5వ కేంద్రమని తెలిపారు.
జిల్లాలో 100 సంవత్సరాలు పైబడిన వారు 200 మంది ఉన్నట్టు జిల్లా కలెక్టర్ ద్వారా తెలిసిందని, సాంకేతిక సమస్య వల్ల వారి పుట్టిన తేదీ తప్పుగా వచ్చిందని, అయితే సంబంధిత తహసీల్దార్ల ద్వారా వారిని నల్గొండ ఆధార్ సేవా కేంద్రానికి పిలిపించి వాటిని సరిచేయాలని కలెక్టర్ కు సూచించారు. కార్యక్రమంలో కలెక్టర్ బి. చంద్రశేఖర్, నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీఓ వై. అశోక్ రెడ్డి తదితరులు ఉన్నారు.
