‘సహకారం’ పై ఆశావహుల ఫోకస్!..సిద్దిపేట జిల్లాలో మొత్తం 21 సహకార సంఘాలు

‘సహకారం’ పై ఆశావహుల ఫోకస్!..సిద్దిపేట జిల్లాలో మొత్తం  21 సహకార సంఘాలు
  •     సొసైటీలకు చైర్మన్లను, డైరెక్టర్లను నామినేట్​చేస్తున్న ప్రభుత్వం
  •     ఇప్పటికే బెజ్జంకి సొసైటీ పాలక వర్గం ఖరారు
  •     మిగతా సొసైటీల పరిధిలో ఆశావహులు అలర్ట్​
  •     ముఖ్య నేతల మద్దతు కోసం చక్కర్లు

సిద్దిపేట, వెలుగు : ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి  సంఘాల(పీఏసీఎస్)ల్లో చైర్మన్, డైరక్టర్ పోస్టులపై ఆశావహుల ఫోకస్​ పెడుతున్నారు. సహకార సంఘ పాలక వర్గాల గడువు ముగియడంతో  ఎన్నికల నిర్వహించకుండా ప్రభుత్వం నామినేటెడ్ పద్ధతిలో చైర్మన్, డైరక్టర్లను నియమిస్తోంది. దీంతో అధికార పార్టీకి చెందిన నేతలు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. 

21 పీఏసీఎస్ లు..  

సిద్దిపేట జిల్లాలో మొత్తం 21 పీఏసీఎస్ లు ఉండగా, ఇప్పటికే  మాన కొండూరు నియోజకవర్గంలోని బెజ్జంకి సొసైటీ పాలక పాలకవర్గాన్ని ప్రకటించడంతో మిగతా చోట్ల ఆశావహులు అలర్ట్​ అయ్యారు. సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, హుస్నాబాద్ నియోజకవర్గాలతో పాటు జనగామ, మానకొండూరు నియోజకవర్గాలకు సంబంధించి కొన్ని మండలాలు సిద్దిపేట జిల్లాలో ఉన్నాయి. ఒక్కొ సొసైటీలో చైర్మన్ తోపాటు 12 మంది డైరెక్టర్లను ప్రభుత్వం నియమిస్తుండగా, నియామకమైనా వారిలోంచి ఒకరిని వైస్ చైర్మన్ గా ఎంపిక చేసుకుంటారు. మానకొండూరు నియోజకవర్గం పరిధిలోని బెజ్జంకి సొసైటీ చైర్మన్ గా వొగ్గు దామోదర్ తోపాటు 12 మంది డైరక్టర్ల ను ప్రభుత్వం నామినేట్ చేయడంతో ఇటీవల ప్రమాణ స్వీకారోత్సవాన్ని సైతం పూర్తి చేశారు. ఎన్నికల ప్రక్రియ లేకుండా నేరుగా చైర్మన్, డైరెక్టర్ పదవులను ప్రభుత్వమే నామినేట్ చేస్తుండటంతో వీటిపై పలువురు ఆశలు పెంచుకున్నారు. 

ఇప్పటికే కొన్ని సొసైటీలకు సంబంధించి  ప్రతిపాదనలు ప్రభుత్వానికి చేరినట్టు తెలుస్తోంది. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు పూర్తయినా మండల , జిల్లా పరిషత్ ఎన్నికలు ఇప్పట్లో జరిగేలా కనిపించడంతో ఏదో ఒక పదవికి నామినేట్ అయితే చాలానే ఉద్దేశంతో పలువురు నేతలు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఆశావహలు ఎక్కువగా తమ పరిధిలోని సొసైటీ చైర్మన్ పదవులే లక్ష్యంగా ముమ్మరంగా ప్రయత్నిస్తుండటంతో గ్రామ స్థాయి నేతలు డైరక్టర్ పదవుల కోసం ప్రయత్నిస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు సిద్దిపేట ఏఎంసీ పాలక వర్గం, సుడా చైర్మన్ పదవులు భర్తీ పెండింగ్ లో ఉండగా, సొసైటీల పాలక వర్గాలను ప్రభుత్వమే నామినేట్ చేస్తుండటంతో ఈ పదవులను పలువురు ఆశిస్తున్నారు. 

ఇన్​చార్జీల నిర్ణయమే కీలకం.. 

జిల్లాలోని సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాల్లో సొసైటీల పాలక వర్గాల ఖరారు విషయంలో నియోజకవర్గ ఇన్​చార్జీల నిర్ణయమే ఫైనల్ కానున్నది. మూడు చోట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తుండటంతో ఆయా చోట్ల కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్​చార్జీలే పదవులను ఖరారు చేయనున్నారు. సిద్దిపేటలో పూజ హరికృష్ణ, దుబ్బాకలో  చెరుకు శ్రీనివాసరెడ్డి, గజ్వేల్​లో తూంకుంటా నర్సారెడ్డి తమ నియోజకవర్గ పరిధిలోని సొసైటీ పదవులను ఖరారుచేయనున్నారు. ఈ క్రమంలో జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ తోపాటు మరో మంత్రి దామోదర రాజనర్సింహ్మ, మాజీ ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, మైనంపల్లి హన్మంతరావు మద్దతు కోసం ఆశావహులు ప్రయత్నాలు ప్రారంభించారు.