వెలుగు ఓపెన్ పేజీ: ఆధిపత్య రాజకీయాల మాటున కనుమరుగైన.. టైగర్ నరేంద్ర పోరాట చరిత్ర

వెలుగు ఓపెన్ పేజీ: ఆధిపత్య రాజకీయాల మాటున కనుమరుగైన.. టైగర్ నరేంద్ర పోరాట చరిత్ర
  • నేడు ఆలె నరేంద్ర జయంతి

‘టైగర్’ ఆలె నరేంద్ర.. తెలంగాణ కోసం జీవితాన్ని అంకితం చేసిన నాయకుడు.  చరిత్రను రాసేది కేవలం అధికారంలో ఉన్నవారు మాత్రమే కాదు. ఒక ఉద్యమం విజయవంతం కావడానికి ముందు ఎన్నో అడుగులుపడతాయి, ఎన్నో స్వరాలు వినిపిస్తాయి, ఎన్నో చేతులు కలిసి పనిచేస్తాయి. కానీ కాలం గడిచేకొద్దీ కొందరి పేర్లు ప్రధాన చరిత్రలో నిలిచిపోతాయి. మరికొందరి పాత్రలు మాత్రం పెద్ద రాజకీయ కథనాల నీడలో కనుమరుగవుతాయి. 

1946లో హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జన్మించిన ఆలె నరేంద్ర చిన్న వయసులోనే ప్రజా జీవితంపై ఆసక్తి పెంచుకున్నారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్  తో ఆయనకు అనుబంధం ఏర్పడింది. ఆ తరువాత జనసంఘ్ రాజకీయాల్లోకి వచ్చారు. జనసంఘ్ తరువాత భారతీయ జనతా పార్టీగా రూపాంతరం చెందినప్పుడు ఆయన బీజేపీలో తన రాజకీయ ప్రయాణాన్ని కొనసాగించారు. హైదరాబాద్ పాతబస్తీ రాజకీయ వాతావరణం ఆయన వ్యక్తిత్వాన్ని మరింత పదునుపెట్టింది. ప్రజలతో నేరుగా కలవడం,  సమస్యలపై దూకుడుగా స్పందించడం, రాజకీయ ప్రత్యర్థులను ధైర్యంగా ఎదుర్కోవడం ఆయన స్వభావంలో భాగమయ్యాయి. ఈ పోరాట స్వభావమే ఆయనకు ‘టైగర్ నరేంద్ర’ అనే పేరు తెచ్చిపెట్టింది. 

తెలంగాణ కోసం బీజేపీతో విభేదించి..

తెలంగాణ కోసం ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయమే ఆయన రాజకీయ జీవితానికి అసలు ప్రత్యేకత.  నరేంద్ర అంటే బీజేపీ, - బీజేపీ అంటే నరేంద్ర అనేవిధంగా ఎదిగిన పార్టీనే వదిలిన నాయకుడు. 2000 ప్రాంతంలో ప్రత్యేక తెలంగాణ డిమాండ్  మళ్లీ రాజకీయంగా బలపడుతున్న సమయంలో, తెలంగాణ రాష్ట్రం కోసం మరింత స్పష్టమైన రాజకీయ పోరాటం అవసరమని  నరేంద్ర భావించారు.  తాను ఉన్న బీజేపీ రాజకీయ వైఖరితో విభేదించిన ఆయన బీజేపీని విడిచిపెట్టారు. తనకు ఉన్న పార్టీ పదవి, రాజకీయ భవిష్యత్తు, వ్యక్తిగత ప్రయోజనాల కంటే తాను నమ్మిన తెలంగాణ లక్ష్యానికి ప్రాధాన్యత ఇచ్చారు.  ఆ తరువాత  తెలంగాణ సాధన సమితి (టీఎస్​ఎస్​)ను ఏర్పాటు చేశారు. ఇది సాధారణ రాజకీయ నిర్ణయం కాదు. ఒక జాతీయ పార్టీలో గుర్తింపు పొందిన నాయకుడు, తనకు ఉన్న రాజకీయ భవిష్యత్తును పక్కనపెట్టి,  ఒక ప్రత్యేక రాష్ట్రం కోసం స్వంత రాజకీయ వేదికను నిర్మించడం ఆయనలోని నిబద్ధతను తెలియజేస్తుంది. 

రాజకీయ మిత్రత్వం నుంచి విభేదాల వరకు 

ఒకే లక్ష్యం కోసం రెండు రాజకీయ శక్తులు వేర్వేరుగా పోరాడటం కంటే వాటిని ఏకం చేయడం అవసరమని భావించిన పరిస్థితుల్లో  ఆలె నరేంద్ర  టీఎస్​ఎస్ ను, టీఆర్​ఎస్​లో  విలీనం చేశారు. ఇది తెలంగాణ ఉద్యమ రాజకీయ చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టం. నరేంద్ర రాజకీయ అనుభవం,  ప్రజా పరిచయం, తెలంగాణపై ఆయనకున్న రాజకీయ అవగాహన  టీఆర్​ఎస్​కు బలాన్ని చేకూర్చాయి.  కానీ రాజకీయాల్లో సంబంధాలు ఎప్పటికీ ఒకేవిధంగా ఉండవనేది ఆలె నరేంద్ర, కేసీఆర్​ మధ్య విభేదాలు పెరగడానికి నిదర్శనంగా నిలుస్తాయి.  టీఆర్ఎస్ పార్టీలో ప్రధాన నేతగా గుర్తింపు పొందిన నరేంద్ర - కేసీఆర్ కంటే ఆదరణ పెరుగుతున్నవేళ ఉద్దేశపూర్వకంగా టైగర్ నరేంద్రను తగ్గించాలనే కుట్రలతో నరేంద్రపై ఇమ్మిగ్రేషన్/ హ్యూమన్ ట్రాఫికింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సంబంధించిన ఆరోపణలు మొదలుపెట్టారు. ఢిల్లీ పోలీసులు ఈ వ్యవహారంలో ఆయనను ప్రశ్నించినట్లు ప్రచారం చేశారు. అయితే ఆరోపణలు రావడం నేరం రుజువైనట్లు కాదు.  నరేంద్ర  ఆరోపణలను ఖండించారు.   చివరకు టీఆర్​ఎస్​  నుంచి దూరమయ్యారు. 2011లో ఆలె నరేంద్ర  మళ్లీ బీజేపీలో చేరారు.  

తెలంగాణ ఏర్పాటును చూడకుండానే..

ఆలె నరేంద్ర గారు 9 ఏప్రిల్ 2014న హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మరణించారు.  అప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి కేవలం కొన్ని వారాలే మిగిలి ఉన్నాయి. 2 జూన్ 2014న తెలంగాణ రాష్ట్రం అధికారికంగా ఏర్పడింది.  తన రాజకీయ జీవితంలో ఒక ముఖ్యమైన భాగాన్ని ప్రత్యేక తెలంగాణ కోసం కేటాయించిన నరేంద్ర, తాను కలలుగన్న తెలంగాణను కళ్లారా చూడలేకపోయారు. ఇది ఆయన జీవితంలోని అత్యంత విషాదకరమైన అంశాల్లో ఒకటి.  తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి ఎన్నో సంవత్సరాలు పోరాడిన నాయకులు, ఉద్యమకారులు, విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజలు తమ వంతు పాత్ర పోషించారు. ఆ చరిత్రలో ఆలె నరేంద్ర అధ్యాయం కూడా ఒక భాగమే.

ఆధిపత్య కథనాల మాటున కనుమరుగైన చరిత్ర

చరిత్రలో ఒక ఉద్యమం విజయవంతమైన తరువాత, ఆ విజయానికి సంబంధించిన ప్రధాన కథనం కొద్దిమంది నాయకులచుట్టూ కేంద్రీకృతమవుతుంది.  ఉద్యమం  ప్రారంభదశల్లో  కీలక పాత్ర పోషించిన అనేకమంది నాయకుల పాత్రలు వెనుకబడిపోతాయి.  ఆ కోణంలో చూస్తే ఆలె నరేంద్ర రాజకీయ జీవితం ఆధిపత్య రాజకీయ కథనాల మాటున కనుమరుగైన ఒక ముఖ్యమైన చరిత్రగా వర్ణించవచ్చు.   తెలంగాణ సాధన ఒకరి వల్ల మాత్రమే జరగలేదు.  అనేకమంది చేసిన పోరాటాల సమిష్టి ఫలితమే అది. అందులో నరేంద్ర పాత్రను గుర్తించడం అంటే మరచిపోయిన అధ్యాయాన్ని తిరిగి చరిత్రలోకి తీసుకురావడం.

టైగర్​ నరేంద్ర.. ఒక ముగింపు కాదు, ఒక స్ఫూర్తి

ఆలె నరేంద్ర తెలంగాణ రాష్ట్రాన్ని చూడలేకపోయారు.  కానీ తెలంగాణ కోసం ఆయన చేసిన రాజకీయ పోరాటాన్ని చరిత్ర మరచిపోకూడదు.  నిజమైన చరిత్ర మనుషుల జీవితాలను వాటి విజయాలు,  వైఫల్యాలు, ధైర్యాలు,  తప్పిదాలతో సహా  నేర్పుతుంది. అందుకే ఆలె నరేంద్ర  జీవితాన్ని భవిష్యత్తు తరాలకు అందించాల్సిన సందేశం ఇదే. ‘లక్ష్యం  గొప్పదైతే  మార్గంలో వచ్చే  కష్టాలకు భయపడకండి. చరిత్రలో పేరు కోసం కాదు , చరిత్రలో మార్పు కోసం పోరాడండి’.  ఆయన జీవితం నుంచి స్ఫూర్తి పొందే ప్రతి యువకుడు ఒక విషయం గుర్తుంచుకోవాలి.   ‘పోరాటం చేసిన ప్రతి అడుగు వెంటనే ఫలితం ఇవ్వకపోవచ్చు.  కానీ  నిజాయితీగా వేసిన అడుగు చరిత్రలో ఎప్పటికీ వృథా కాదు’  అని భావించడమే  టైగర్  నరేంద్రకు మనమిచ్చే 
ఘన నివాళి.

-కటకం నర్సింగ్ రావు 

మన ఆలోచన సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు

ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ

openpage@v6velugu.com

రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని 

హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.

రచన 700 పదాలకు మించరాదు.