ఎల్కతుర్తి/భీమదేవరపల్లి, వెలుగు: గ్రామాల సమగ్రాభివృద్ధే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ‘పల్లె పల్లెకు పొన్నం అన్న.. పల్లె పల్లెలో ప్రజా పాలన’ కార్యక్రమాన్ని హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలో గురువారం ప్రారంభించారు. తొలిరోజు కేశవాపూర్, రామకృష్ణాపూర్, తిమ్మాపూర్, గుంటూరు పల్లి, ఆరెపల్లి, బావుపేట గ్రామాల్లో పర్యటించారు. ఆయా గ్రామ పంచాయతీల వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ప్రభుత్వ పథకాల అమలు, వ్యవసాయం, ఆరోగ్యం, మహిళా సంక్షేమం, ఉపాధి తదితర అంశాలపై గ్రామస్తులతో నేరుగా మాట్లాడారు. వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్షించారు. వివిధ సమస్యలపై ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ప్రజల వద్దకు ప్రభుత్వం రావాలి.. ప్రజల సమస్యలను ప్రజల మధ్యే పరిష్కరించాలి’ అనే నినాదంతో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో రోజుకో మండలంలోని గ్రామాలను ఎంపిక చేసి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. కేశవాపూర్ గ్రామంలో 300 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు చేస్తే గ్రామ అభివృద్ధికి రూ.10 లక్షలు మంజూరు చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. కేశవాపూర్‌ను సోలార్ మోడల్ విలేజ్‌గా ఎంపిక చేశామని మంత్రి తెలిపారు. ప్రతి ఇంటికి సోలార్ విద్యుత్, సోలార్ పంపుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం భీమదేవరపల్లి మండలం ముల్కనూరు అంబేద్కర్ చౌరస్తాలో రాజీవ్‌గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. రాజీవ్ గాంధీ విగ్రహానికి నివాళులర్పించి కేక్ కట్ చేశారు.
