లుసానే డైమండ్ లీగ్‌ : నీరజ్‌‌పైనే దృష్టి

లుసానే డైమండ్ లీగ్‌ : నీరజ్‌‌పైనే దృష్టి

లుసానే: ఇండియా స్టార్‌‌ జావెలిన్‌‌ త్రోయర్‌‌ నీరజ్‌‌ చోప్రా.. లుసానే డైమండ్‌‌ లీగ్‌‌కు రెడీ అయ్యాడు. శుక్రవారం జరిగే పోటీలో గెలిచి డైమండ్‌‌ లీగ్‌‌ ఫైనల్‌‌కు అర్హత సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. అయితే గతేడాది సెప్టెంబర్‌‌ నుంచి వెన్ను నొప్పితో బాధపడుతున్న నీరజ్‌‌ ప్రస్తుతం గాయం నుంచి కోలుకునే దశలో ఉన్నాడు. వంద శాతం ఫిట్‌‌నెస్‌‌ లేకపోయినా గ్లాస్గో టోర్నీలో ఈటెను 85.83 మీటర్ల దూరం విసిరి రజతం సాధించాడు.

ప్రస్తుతం స్విస్‌‌లోని బీల్‌‌ కేంద్రంగా కోచ్‌‌ జైవీర్‌‌ చౌదరి పర్యవేక్షణలో ప్రాక్టీస్‌‌ చేసున్న నీరజ్‌‌.. లుసానే మీట్‌‌లో ప్రదర్శనను మెరుగుపర్చుకోవాలని భావిస్తున్నాడు. ప్రస్తుత డైమండ్‌‌ లీగ్‌‌ స్టాండింగ్స్‌‌లో 6 పాయింట్లతో ఏడో ప్లేస్‌‌లో ఉన్న నీరజ్‌‌.. ఈ పోటీల్లో గెలవడం తప్పనిసరి. జావెలిన్‌‌ విభాగంలో టాప్‌‌–6లో నిలిచిన అథ్లెట్లు మాత్రమే వచ్చే నెల 4, 5వ తేదీల్లో జరిగే ఫైనల్‌‌కు అర్హత సాధిస్తారు.

లంక స్టార్‌‌ త్రోయర్‌‌ రుమేశ్‌‌ పతిరాగే, అండర్సన్‌‌ పీటర్స్‌‌ ఇప్పటికే ఫైనల్‌‌ బెర్త్‌‌ ఖాయం చేసుకున్నారు. లుసానే మీట్‌‌కు అర్షద్‌‌ నదీమ్‌‌ (పాకిస్తాన్‌‌), జూలియన్‌‌ వెబర్‌‌ దూరంగా ఉండటంతో పోటీ కాస్త తగ్గింది. అయితే పతిరాగే, కెసోర్‌‌ వాల్కాట్‌‌, అండర్సన్‌‌ పీటర్స్‌‌ నుంచి నీరజ్‌‌కు గట్టి పోటీ ఎదురుకానుంది.