సింక్ఫీల్డ్ కప్ చెస్ టోర్నీలో రన్నరప్గా ప్రజ్ఞానంద.. గ్రాండ్ ఫినాలేకు అర్హత

 సింక్ఫీల్డ్ కప్ చెస్ టోర్నీలో రన్నరప్గా ప్రజ్ఞానంద.. గ్రాండ్ ఫినాలేకు అర్హత

సెయింట్ లూయిస్ (అమెరికా):  ఇండియా గ్రాండ్‌‌ మాస్టర్‌‌ ఆర్‌‌. ప్రజ్ఞానంద.. సింక్‌‌ఫీల్డ్‌‌ కప్‌‌ చెస్‌‌ టోర్నీలో రన్నరప్‌‌తో సరిపెట్టుకున్నాడు. గురువారం జరిగిన ఆర్మగెడాన్‌‌ టైబ్రేక్‌‌లో ప్రజ్ఞా.. వెస్లీ సో (అమెరికా) చేతిలో ఓడాడు. ఫలితంగా రెండో స్థానంతో టోర్నీని ముగించాడు.

ర్యాపిడ్‌‌ రెండు గేమ్‌‌లు డ్రా కావడంతో ఇద్దరు ప్లేయర్లు 1–1తో నిలిచారు. నిర్ణయాత్మక ఆర్మగెడాన్‌‌లో తెల్లపావులతో ఆడిన ప్రజ్ఞానంద కచ్చితంగా గెలవాల్సిన టైమ్‌‌లో ఒత్తిడికి గురయ్యాడు. కనీసం డ్రా చేసుకున్నా విజేతగా నిలిచే అవకాశం ఉండటంతో వెస్లీకి టైటిల్‌‌ దక్కింది.

అంతకుముందు అనిష్‌‌ గిరి (నెదర్లాండ్స్‌‌)తో జరిగిన చివరి క్లాసిక్‌‌ గేమ్‌‌ను ప్రజ్ఞానంద డ్రాగా ముగించాడు. ఫలితంగా 5.5 పాయింట్లతో వెస్లీ సోతో కలిసి సంయుక్తంగా టాప్‌‌లో నిలిచాడు. ఈ ఇద్దరిలో విజేతను తేల్చేందుకు ఆర్మగెడాన్‌‌ను నిర్వహించారు. ఈ టోర్నీలో రెండో స్థానంలో నిలిచినా.. మొత్తం గ్రాండ్‌‌ చెస్‌‌ టూర్‌‌ స్టాండింగ్స్‌‌లో ప్రజ్ఞానంద 35.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు.

వెస్లీ సో (34.5) కంటే ఒక్క పాయింట్‌‌ అధికంగా సాధించి ఈ ఏడాది చివర్లో జరిగే గ్రాండ్‌‌ ఫినాలే టోర్నీకి ప్రజ్ఞా అర్హత సాధించాడు. ఈ టూర్‌‌లో టాప్‌‌–4లో నిలిచిన ప్లేయర్లు ఫినాలేలో తలపడతారు. ఫ్యాబియానో కరువాన (అమెరికా 4.5), విన్సెంట్‌‌ కీమర్‌‌ (జర్మనీ 5) వరుసగా మూడు, నాలుగు స్థానాలు సాధించారు.