- క్యాన్సర్ కేర్, పాలియేటివ్ సేవలపైనా పార్లమెంటరీ హెల్త్ కమిటీ ప్రశంసలు
- తాజ్ కృష్ణాలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, పరిశోధన సంస్థలతో 21 మంది ఎంపీల భేటీ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో నిరుపేదలకు ఉచితంగా రోగ నిర్ధారణ టెస్టులు అందిస్తున్న టీ-డయాగ్నస్టిక్స్, కార్పొరేట్ వైద్యాన్ని చేరువ చేస్తున్న ఆరోగ్యశ్రీ స్కీమ్ పనితీరు బాగుందని పార్లమెంటరీ హెల్త్ కమిటీ ప్రశంసించింది. వీటితో పాటు ప్రభుత్వ హాస్పిటల్స్ లో అందుతున్న క్యాన్సర్ ట్రీట్‌మెంట్, దీర్ఘకాలిక రోగులకు ఊరటనిచ్చే పాలియేటివ్ కేర్ నెట్‌వర్క్ బాగుందని మెచ్చుకుంది.
ప్రొఫెసర్ రాంగోపాల్ యాదవ్ చైర్మన్ గా ఉన్న ఈ 31 మంది సభ్యుల కమిటీలో 21 మంది ఎంపీలు గురువారం సిటీలోని హోటల్ తాజ్ కృష్ణలో సీఎస్, హెల్త్ డిపార్ట్‌మెంట్ ఉన్నతాధికారులతో హైలెవల్ రివ్యూ మీటింగ్ నిర్వహించారు. తెలంగాణ నుంచి కమిటీలో ఉన్న ఎంపీలు డాక్టర్ కడియం కావ్య, డాక్టర్ బి. పార్థసారథి రెడ్డి హాజరైన ఈ సమావేశంలో రాష్ట్రంలో అమలవుతున్న హెల్త్ పాలసీలు, సేవలపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
ఎంఎన్ జే ఆస్పత్రి సేవలపై ప్రజెంటేషన్
ఈ సందర్భంగా ఎంఎన్ జే క్యాన్సర్ హాస్పిటల్ అధికారులు అక్కడ అందుతున్న ఉచిత వైద్య సేవల వివరాలను అందించారు. పేదలకు అందుబాటు ధరల్లో క్యాన్సర్ నివారణ మందుల తయారీపై ఐఐసీటీ, క్యాన్సర్ కణాల జన్యు-మాలిక్యులర్ రీసెర్చ్‌పై సీసీఎంబీ శాస్త్రవేత్తలు ప్రజెంటేషన్లు ఇచ్చారు. ఎన్ఐఎన్ పనితీరు, ప్రైవేట్ హాస్పిటల్స్, ఎన్జీవోల ద్వారా అందుతున్న అంతర్జాతీయ వైద్య సేవలను కమిటీ సమీక్షించింది. ఇదే సమయంలో సాధారణ ప్రజలకు వైద్యం భారం కాకుండా ఔట్ ఆఫ్ పాకెట్ ఎక్స్‌పెండేచర్ తగ్గించేందుకు చేపట్టిన చర్యలపై కమిటీ ఆరా తీసింది.
మిగతా టిమ్స్ ఎప్పుడొస్తయ్.?
హైదరాబాద్‌లో సూపర్ స్పెషాలిటీ సేవల విస్తరణ కోసం నిర్మిస్తున్న టిమ్స్ హాస్పిటల్స్ పురోగతిపై కమిటీ దృష్టి సారించింది. సనత్‌నగర్ టిమ్స్ అందుబాటులోకి రాగా, ఎల్బీనగర్, అల్వాల్ లలో నిర్మాణంలో ఉన్న మిగతా టిమ్స్ హాస్పిటల్స్ ఎప్పటిలోగా స్టార్ట్ అవుతాయని అధికారులను అడిగి తెలుసుకుంది. వివిధ రాష్ట్రాల పర్యటనల అనంతరం దేశంలో హెల్త్ కేర్ సిస్టమ్ బలోపేతానికి అవసరమైన సిఫార్సులతో కేంద్ర ప్రభుత్వానికి తన ఫైనల్ రిపోర్ట్ సమర్పించనుంది.
