వందేమాతరం గేయం ఆలాపనపై.. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ

వందేమాతరం గేయం ఆలాపనపై.. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ
  • ఫ్రీడమ్‌‌ ఫైటర్లను కాంగ్రెస్ అవమానిస్తున్నది: అమిత్ షా 
  • ఓట్ల కోసం కాంగ్రెస్ ‘న్యూ ముస్లిం లీగ్‌’లా మారింది: నితిన్ నబీన్ 
  • బీజేపీ నేతలు నకిలీ దేశభక్తులంటూ కాంగ్రెస్ ఎదురుదాడి 
  • కాంగ్రెస్​ ‘విదేశీ మనస్తత్వంతో’ నడుస్తున్నది: వీహెచ్‌‌పీ 

చెన్నై/న్యూఢిల్లీ: జాతీయ గేయం వందేమాతరం ఆలాపన విషయంలో కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటలయుద్ధం సాగింది. వందేమాతరంలోని మొత్తం ఆరు చరణాలనూ పాడాలని ఇటీవల కేంద్రం చట్టం తీసుకురాగా, ఎప్పట్లాగే రెండు చరణాలను మాత్రమే పాడతామని కాంగ్రెస్ బుధవారం స్పష్టం చేసింది. దీంతో కాంగ్రెస్, బీజేపీ మధ్య గురువారం తీవ్రస్థాయిలో విమర్శలు, ప్రతివిమర్శలు చోటుచేసుకున్నాయి. 

వందేమాతరంలో కేవలం రెండు చరణాలు మాత్రమే ఆలపించాలని బుధవారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తీవ్రంగా తప్పుపట్టారు. ఇది దేశ ద్రోహమని, చట్టాన్ని బహిరంగంగా ధిక్కరిస్తూ బుజ్జగింపు రాజకీయాల కోసం తీసుకున్న నిర్ణయమని ఆయన ఆ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 

గతంలో వందేమాతరం విభజన కారణంగా దేశం ఎదుర్కొన్న పరిణామాలను ఆయన గుర్తుచేశారు. ఈ మేరకు ఆయన గురువారం ‘ఎక్స్’ వేదికగా ఓ ప్రకటన విడుదల చేశారు. ‘వందేమాతరం పూర్తి గేయానికి బదులుగా కేవలం రెండు చరణాలు మాత్రమే పాడాలన్న సీడబ్ల్యూసీ నిర్ణయం దేశద్రోహం మాత్రమే కాదు.. పార్లమెంటు చేసిన చట్టాన్ని  బహిరంగంగా ధిక్కరించడం. 

1937లో ముస్లింలను బుజ్జగించడం కోసం కాంగ్రెస్ పార్టీ వందేమాతరం గేయాన్ని రెండుగా విభజించి దేశ విభజనకు పునాది వేసింది. అక్కడి నుంచి దేశంలో ద్విజాతి సిద్ధాంతం బలపడింది. చివరికి దేశ విభజన జరిగి పాకిస్తాన్ ఆవిర్భవించింది’ అని అమిత్ షా పేర్కొన్నారు. వందేమాతరాన్ని విభజించే తప్పు ఇప్పటికే ఒకసారి జరిగిందని, దేశం దాని పరిణామాలను అనుభవించిందని ఆయన స్పష్టం చేశారు. 

కాంగ్రెస్ చేస్తున్న ఈ ఓటు బ్యాంకు రాజకీయాలకు వ్యతిరేకంగా దేశ ప్రజలందరూ ఏకమై గళం ఎత్తాలని ఆయన పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఓట్ల కోసం ‘కొత్త ముస్లిం లీగ్’లా మారిందని బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబిన్ విమర్శించారు. 

వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే: కాంగ్రెస్ 

వందేమాతరం ఆలాపన విషయంలో అమిత్​షా వ్యాఖ్యలపై కాంగ్రెస్​ ఎదురుదాడికి దిగింది. బీజేపీ నాయకులను దొంగ, నకిలీ దేశభక్తులుగా అభివర్ణించింది. సమస్యలను పరిష్కరించడంలో తమ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించింది. 

ఈమేరకు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరామ్ రమేశ్​ఎక్స్​వేదికగా స్పందిస్తూ.. బుధవారం జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో కొందరు నాయకులు వందేమాతరం అంశాన్ని లేవనెత్తారని, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ వైఖరిని స్పష్టంగా తెలియజేశారని ఆయన పేర్కొన్నారు. రవీంద్రనాథ్ ఠాగూర్ సలహా మేరకు నెహ్రూ, సర్దార్ పటేల్, నేతాజీ, అబుల్ కలామ్ ఆజాద్, గోవింద్ వల్లభ్ పంత్, ఆచార్య నరేంద్ర దేవ్ వంటి దిగ్గజాలు అక్టోబర్ 28, 1937న సీడబ్ల్యూసీ ఆమోదించిన తీర్మానాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు చదివి వినిపించారని రమేశ్ పేర్కొన్నారు. జనవరి 25, 1950న రాజ్యాంగ పరిషత్ చివరి సమావేశంలో రాజేంద్ర ప్రసాద్.. జాతీయ గీతం ‘జన గణ మన’ అని, జాతీయ గేయం ‘వందేమాతరం’ అని ప్రకటించారని ఆయన గుర్తు చేశారు.  

ఓటు బ్యాంకు పాలిటిక్స్ లేకుండా కాంగ్రెస్ ఉండదు: వీహెచ్‌‌పీ 

వందేమాతరం గేయంలోని మొదటి రెండు చరణాలు మాత్రమే ఆలపించాలని కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయంపై విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్​పీ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రతిపక్ష పార్టీ ‘విదేశీ మనస్తత్వంతో’ నడుస్తోందని,  ఓటు బ్యాంకు రాజకీయాలు లేకుండా అది మనుగడ సాగించలేదని విమర్శించింది. ఈ మేరకు గురువారం వీహెచ్‌‌పీ జాతీయ అధికార ప్రతినిధి వినోద్ బన్సల్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. మిగిలిన నాలుగు చరణాలను ఆలపించకుండా కాంగ్రెస్ నిరాకరించడానికి కారణం.. వాటిలో భారతీయ విలువలు, ప్రాచీన సంస్కృతి, సంప్రదాయాలు, జాతీయ నైతికతతో తీవ్రంగా ముడిపడి ఉన్న పదాలు ఉండటమేనని పేర్కొన్నారు. కాంగ్రెస్ విధానం దేశ సాంస్కృతిక గుర్తింపునకు విరుద్ధంగా ఉందన్నారు.