- మోదీ చాలీసా విడుదల, ప్రధానికి బిహార్‌లో గుడి కడ్తామని వెల్లడి
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీని దేవుడిగా చిత్రీకరిస్తూ ఆయన కటౌట్‌కు పూజలు చేశారు. హనుమాన్ చాలీసా మాదిరిగా మోదీ చాలీసాను రాసి రిలీజ్ చేశారు. ఆ చాలీసాను పఠిస్తూ పూజా కార్యక్రమం నిర్వహించారు. గురువారం ఢిల్లీలోని ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా (పీసీఐ) ప్రాంగణంలో బిహార్ స్టేట్ ట్రాన్స్‌జెండర్ వెల్ఫేర్ బోర్డు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర విమర్శలు వచ్చాయి. మోదీ తమ వర్గానికి హక్కులు కల్పించేందుకు చర్యలు తీసుకున్నందుకు కృతజ్ఞతగా ఆయనకు గుడి కట్టాలని నిర్ణయించుకున్నామని బోర్డు వైస్ ప్రెసిడెంట్ రాజన్ సింగ్ చెప్పారు.
బిహార్‌లో 5 ఎకరాల స్థలంలో రూ.112 కోట్లతో ‘లార్డ్ శ్రీ నరేంద్ర మోదీ’ ఆలయం నిర్మిస్తామని వెల్లడించారు. ట్రాన్స్‌జెండర్ వర్గానికి తొలిసారిగా ప్రభుత్వం హక్కులు కల్పించిందని, ఉపాధి అవకాశాలు కూడా కల్పించిందని చెప్పారు. కాబట్టి.. మోదీకి గుడి కడితే తప్పేముందని రాజన్ సింగ్ ప్రశ్నించారు. ట్రాన్స్‌జెండర్ పర్సన్స్ (ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్) సవరణ చట్టంపై విమర్శలు వస్తున్న విషయాన్ని ప్రస్తావించగా.. ఆ వర్గం ఆ చట్టాన్ని వ్యతిరేకించడం లేదని, ప్రతిపక్షాలే వ్యతిరేకిస్తున్నాయని ఆరోపించారు. అయితే, ఈ కార్యక్రమంతో తమకు సంబంధం లేదని ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. వాళ్లు కిరాయికి తీస్కుని కార్యక్రమం చేశారని పేర్కొంది. హాల్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని తెలిసి వెంటనే కార్యక్రమాన్ని నిలిపివేశామని చెప్పింది.
