డీలిమిటేషన్‌‌‌‌‌‌‌‌తో..మా గొంతు నొక్కొద్దు: దక్షిణాది రాష్ట్రాల సీఎంలు

డీలిమిటేషన్‌‌‌‌‌‌‌‌తో..మా గొంతు నొక్కొద్దు: దక్షిణాది రాష్ట్రాల సీఎంలు
  • సదరన్​ జోనల్​ మీటింగ్​లో దక్షిణాది రాష్ట్రాల సీఎంలు
  • మరో 25 ఏండ్లు లోక్ సభ సీట్లు 543 ఉండాలన్న డీకే
  • వీటిలోనే మహిళా రిజర్వేషన్ అమలుకు డిమాండ్
  • దేశ జీడీపీలో మూడో వంతు వాటా మేమే ఇస్తున్నం
  • అందుకు తగ్గట్టు రాజకీయ ప్రాతినిధ్యం ఉండాలె
  • డీలిమిటేషన్​లో వాటా తగ్గదని హామీ ఇవ్వాలన్న విజయ్
  • నీట్ నుంచి తమిళనాడును మినహాయించాలని వ్యాఖ్య
  • గోదావరి–కావేరి లింక్​తో 500 టీఎంసీలు మళ్లించాలి: బాబు
  • దక్షిణాది రాష్ట్రాల మధ్య సమన్వయం అవసరమని కామెంట్​
  • మహాబలిపురంలో అమిత్‌‌‌‌‌‌‌‌ షాతో జోనల్‌‌‌‌‌‌‌‌ కౌన్సిల్‌‌‌‌‌‌‌‌ మీటింగ్

చెన్నై: జనాభా నియంత్రణలో ముందున్న తమ రాష్ట్రాలకు రాజకీయంగా శిక్ష వేయొద్దని దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్రాన్ని డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేశారు. జనాభా ఆధారంగా చేపట్టే డీలిమిటేషన్‌‌‌‌‌‌‌‌తో దక్షిణాది రాష్ట్రాలకు లోక్‌‌‌‌‌‌‌‌సభలో ప్రాతినిధ్యం తగ్గకూడదని స్పష్టం చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థకు భారీగా సహకరిస్తున్న రాష్ట్రాలకు రాజకీయ నిర్ణయాల్లో కూడా తగిన ప్రాధాన్యం ఉండాలన్నారు. తమ రాష్ట్రాల రాజకీయ గొంతును బలహీనం చేయడం సరికాదన్నారు. 

అలాగే కేంద్ర పన్నుల పంపిణీ, కేంద్ర పథకాల నిధులు, ప్రత్యేక గ్రాంట్లు, రాష్ట్రాలకు రావాల్సిన ప్రాజెక్టుల విషయంలో కూడా పనితీరు ఆధారంగా ఎటువంటి నష్టం జరగకుండా రాష్ట్రాలకు న్యాయం చేయాలని కోరారు. ఇందుకోసం కేంద్రం స్పష్టమైన విధానం తీసుకురావాలని డిమాండ్ చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌‌‌‌‌‌‌‌ షా అధ్యక్షతన గురువారం తమిళనాడులోని మహాబలిపురంలో 31వ దక్షిణాది జోనల్‌‌‌‌‌‌‌‌ కౌన్సిల్‌‌‌‌‌‌‌‌ సమావేశం జరిగింది. తమిళనాడు సీఎం జోసెఫ్‌‌‌‌‌‌‌‌ విజయ్‌‌‌‌‌‌‌‌, కర్ణాటక సీఎం డీకే శివకుమార్‌‌‌‌‌‌‌‌, కేరళ సీఎం వీడీ సతీశన్‌‌‌‌‌‌‌‌, ఏపీ సీఎం చంద్రబాబు హాజరయ్యారు. 

సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి విదేశీ పర్యటనలో ఉండటంతో తెలంగాణ తరఫున డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పాల్గొన్నారు. పుదుచ్చేరి తదితర కేంద్ర పాలిత ప్రాంతాల ప్రతినిధులు కూడా సమావేశానికి వచ్చారు. ఈ సమావేశంలో డీలిమిటేషన్‌‌‌‌‌‌‌‌ ప్రధాన చర్చగా మారింది. అయితే, దీనిని రాజకీయ అంశంగా పేర్కొన్న అమిత్‌‌‌‌‌‌‌‌ షా జోనల్‌‌‌‌‌‌‌‌ కౌన్సిల్‌‌‌‌‌‌‌‌ సమావేశంలో చర్చించవద్దని అన్నట్టు సమాచారం. అయినప్పటికీ దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాతినిధ్యం, జనాభా నియంత్రణ, కేంద్ర నిధుల పంపకం, నదీ జలాల వివాదాలు, సాగునీటి ప్రాజెక్టులు, మౌలిక వసతులు, రాష్ట్రాల మధ్య పెండింగ్‌‌‌‌‌‌‌‌ సమస్యలను సీఎంలు ప్రస్తావించారు.

1971 జనాభాను ప్రాతిపదికగా తీసుకోండి: డీకే

డీలిమిటేషన్‌‌‌‌‌‌‌‌ విషయంలో దక్షిణాది రాష్ట్రాల ఆందోళనలను కర్నాటక సీఎం డీకే శివకుమార్‌‌‌‌‌‌‌‌ బలంగా వినిపించారు. జనాభా నియంత్రణలో విజయం సాధించిన దక్షిణాది రాష్ట్రాల రాజకీయ గొంతును అదే కారణంతో తగ్గించడం సరికాదన్నారు. దేశ జనాభాలో దాదాపు 20 శాతం ఉన్న దక్షిణాది రాష్ట్రాలు జీడీపీలో దాదాపు మూడో వంతు వాటా ఇస్తున్నాయని శివకుమార్‌‌ గుర్తుచేశారు. దేశ ఆర్థిక వ్యవస్థకు ఇంతటి సహకారం అందిస్తున్న రాష్ట్రాలకు తగిన రాజకీయ ప్రాతినిధ్యం కూడా ఉండాలన్నారు. దక్షిణాది రాష్ట్రాలకు ఒక్క సీటు కూడా తగ్గదనే హామీ సరిపోదని చెప్పారు. 

ఇతర రాష్ట్రాల్లో సీట్లు పెరిగి, దక్షిణాది రాష్ట్రాల సీట్లు అదే స్థాయిలో ఉంటే పార్లమెంట్‌‌‌‌లో తమ రాజకీయ బలం తగ్గి, గొంతు బలహీనమవుతుందన్నారు. అందుకే డీలిమిటేషన్‌‌లో 1971 జనాభా ప్రాతిపదికను కొనసాగించాలని, ప్రస్తుతం ఉన్న 543 లోక్‌‌సభ సీట్లను వచ్చే 25 ఏండ్ల పాటు కొనసాగించాలని డిమాండ్‌‌ చేశారు. మహిళా రిజర్వేషన్లను కూడా కొత్త డీలిమిటేషన్‌‌తో ముడిపెట్టకుండా, ప్రస్తుతం ఉన్న 543 సీట్లలోనే అమలు చేయాలని కోరారు. దీనిపై దక్షిణాది జోనల్‌‌ కౌన్సిల్‌‌ తీర్మానం చేయాలని ప్రతిపాదించారు.

కర్నాటకకు ఆరేండ్లలో రూ.65 వేల కోట్ల నష్టం 

15వ ఆర్థిక సంఘం కాలంలో తమ రాష్ట్రానికి కేంద్ర పన్నుల్లో వాటా 4.7 శాతం నుంచి 3.6 శాతానికి తగ్గడంతో ఆరేండ్లలో సుమారు రూ.65 వేల కోట్ల నష్టం జరిగిందని డీకే తెలిపారు. రూ.5,495 కోట్ల ప్రత్యేక గ్రాంట్లు, రూ.6 వేల కోట్ల రాష్ట్ర ప్రత్యేక గ్రాంట్లు కూడా విడుదల కాలేదన్నారు. 16వ ఆర్థిక సంఘంలో కర్నాటక వాటా 4.131 శాతానికి పెరిగిందని.. అయితే దాన్ని మళ్లీ 4.7 శాతానికి పెంచాలని.. బెంగళూరు–ముంబై హైస్పీడ్‌‌ రైలు, రాయచూరులో ఎయిమ్స్‌‌, కల్యాణ కర్నాటకకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కోరారు.

మేకెదాటుకు సహకరించాలి

కావేరి నదిపై నిర్మిస్తున్న మేకెదాటు ప్రాజెక్టు కర్నాటకతో పాటు తమిళనాడు, పుదుచ్చేరి రైతులకు కూడా ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ ప్రాజెక్టుకు కేంద్రం సహకరించాలని కోరారు. అప్పర్‌‌ భద్ర ప్రాజెక్టు కోసం కేంద్రం ప్రకటించిన రూ.5,300 కోట్లను వెంటనే విడుదల చేయాలని విన్నవించారు. అలాగే సీఎస్‌‌ఆర్‌‌ నిధులను స్థానిక విద్య, వైద్యం వంటి అవసరాలకు అనుగుణంగా వాడుకునేలా రాష్ట్ర ప్రభుత్వాలకు నిర్ణయాధికారం ఉండాలని సూచించారు.
తమిళనాడు సీట్ల వాటా తగ్గకూడదు: విజయ్

తమిళనాడు సీఎం విజయ్‌‌ కూడా  ప్రస్తుతం దేశవ్యాప్తంగా 543 లోక్‌‌సభ సీట్లకు ఉన్న పరిమితిని అలాగే కొనసాగించాలని కోరారు. తమిళనాడులో ప్రస్తుతం ఉన్న 39 లోక్‌‌సభ సీట్ల సంఖ్యలో కూడా ఎలాంటి మార్పు ఉండకూడదన్నారు. జనాభా ఆధారంగా సీట్ల పునర్విభజన జరిగితే జనాభా నియంత్రణలో ముందున్న దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాతినిధ్యం తగ్గే ప్రమాదం ఉందని తెలిపారు. జనాభా నియంత్రణలో సాధించిన విజయమే రాజకీయ నష్టంగా మారకూడదన్నారు. లోక్‌‌ సభలో రాష్ట్రాల వాటా తగ్గదని కేంద్రం చట్టపరమైన హామీ ఇవ్వాలని డిమాండ్‌‌ చేశారు.

నీట్‌‌ నుంచి మినహాయింపు ఇవ్వాలి

రాష్ట్రంలోని విద్యార్థులకు, ముఖ్యంగా గ్రామీణ, సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థులకు నీట్‌‌ వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని విజయ్ పేర్కొన్నారు. నీట్‌‌ నుంచి తమిళనాడుకు మినహాయింపు ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు. రాష్ట్ర కోటాలోని ఎంబీబీఎస్‌‌, బీడీఎస్‌‌, ఆయుష్‌‌ సీట్లను పాఠశాల విద్యలో సాధించిన మార్కుల ఆధారంగా భర్తీ చేసుకునే అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

దక్షిణాది కలిస్తే..10 ట్రిలియన్‌‌ డాలర్ల ఎకానమీ: చంద్రబాబు

దేశ జీడీపీలో 31 శాతం దక్షిణాది రాష్ట్రాలే సమకూరుస్తున్నాయని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పరస్పర సహకారం, సమన్వయంతో సమష్టిగా ప్రణాళికలు అమలు చేస్తే 2047 నాటికి ఈ రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థ 10 ట్రిలియన్‌‌ డాలర్లకు చేరే అవకాశం ఉందన్నారు. ఏపీ, కర్నాటక, తమిళనాడును కలుపుతూ కుప్పం మీదుగా బుల్లెట్‌‌ ట్రైన్‌‌ కారిడార్‌‌ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. 

అమరావతి, బెంగళూరు, చెన్నై మధ్య సమగ్ర రవాణా వ్యవస్థ ఏర్పాటు చేయాలని సూచించారు. దక్షిణాది రాష్ట్రాలకు ఉమ్మడి లాజిస్టిక్స్‌‌ నెట్‌‌వర్క్‌‌, డ్రై పోర్టులు ఏర్పాటు చేయాలని కోరారు. దక్షిణాది విద్యుత్‌‌ గ్రిడ్‌‌ను జాతీయ గ్రిడ్‌‌తో పూర్తిస్థాయిలో అనుసంధానం చేయా లన్నారు. యూనివర్సిటీలు, స్కిల్​డెవలప్‌‌మెంట్ సంస్థలతో ఉమ్మడి కన్సార్షియం ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.

నదీ జలాలపై సౌత్ రాష్ట్రాలు కలిసి పనిచేయాలి

నీటి సమస్యలకు దీర్ఘకాలిక పరిష్కారం కోసం గోదా వరి-కావేరి నదుల అనుసంధానాన్ని వేగవంతం చేయాలని చంద్రబాబు కోరారు. ఈ ప్రాజెక్టు ద్వారా 500 టీఎంసీలకుపైగా నీటిని మళ్లించాలని ప్రతిపాదించారు. దీంతో తమిళనాడులో నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని చెప్పారు. నదీ జలాల విషయంలో ఆంధ్రప్రదేశ్‌‌, తెలంగాణ, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలు కలిసి పనిచేయాలని సూచించా రు. గంగా-కావేరి నదుల అనుసంధానానికి ప్రణాళిక రూపొందించాలని కోరారు. నదుల అనుసంధాన ప్రాజెక్టులకు సంబంధించిన డీపీఆర్‌‌లు, కేంద్ర అనుమతులు నిర్ణీత గడువులో పూర్తి చేయాలని సూచించారు. 

విభజన హామీలు నెరవేర్చాలి

విభజన జరిగి 12 ఏండ్లు గడుస్తున్నా 9, 10 షెడ్యూళ్లలోని పలు సంస్థల విభజన ఇంకా పూర్తి కాలేదని చంద్రబాబు అమిత్​షా దృష్టికి తీసుకెళ్లారు. వీటి పరిష్కారానికి కేంద్రం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. విభజన చట్టంలోని సెక్షన్‌‌ 56కు సంబంధించిన అంశాలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. దుగ్గరాజపట్నం పోర్టు, రిఫైనరీ ప్రతిపాదనలకు అనుమతులు వేగవంతం చేయాలని కోరారు. విశాఖపట్నం, విజయవాడ మెట్రో ప్రాజెక్టులకు ఆమోదం ఇవ్వాలని, కడప- జేఎస్‌‌డబ్ల్యూ రైల్వే లింకును వేగవంతం చేయాలని డిమాండ్‌‌ చేశారు. 

కేంద్ర పథకాల భారం రాష్ట్రాలపై పడొద్దు: సతీశన్

లోక్‌‌సభ సీట్ల సంఖ్య పెంచకుండానే మహిళలకు మూడో వంతు రిజర్వేషన్లను అమలు చేయాలని కూడా కేరళ సీఎం వీడీ సతీశన్‌‌ డిమాండ్‌‌ చేశారు. గనులు, ఖనిజాలపై రాష్ట్రాల హక్కులను ప్రభావితం చేసే చట్ట సవరణలను వెనక్కి తీసుకోవాలని కోరారు. ముల్లపెరియార్‌‌ డ్యామ్‌‌ వివాదంపై మాట్లాడుతూ.. కొత్త డ్యామ్‌‌ నిర్మించడానికి తమిళనాడు అంగీకరిస్తే, దాన్నుంచి తమిళనాడుకు రావాల్సిన పూర్తి నీటి వాటాను ఇస్తామని చెప్పారు. డ్యామ్‌‌ రూపకల్పన, స్థలం, నిర్మాణ బాధ్యతలను తమిళనాడే చూసుకోవచ్చని, నిర్మాణ వ్యయాన్ని మాత్రం కేరళ భరిస్తుందని ప్రతిపాదించారు. కేంద్ర పథకాల అమలులో రాష్ట్రాలపై పడుతున్న ఆర్థిక భారాన్ని సతీశన్ ప్రస్తావించారు. ఆయుష్మాన్‌‌ భారత్‌‌- ప్రధాన్‌‌ మంత్రి జన్‌‌ ఆరోగ్య యోజన అమలులో కేరళ దాదాపు 90 శాతం ఆర్థిక భారాన్ని భరిస్తోందని చెప్పారు. అన్ని రాష్ట్రాలకు ఒకే ప్రీమియం విధానం పెట్టడం కంటే, ఆయా రాష్ట్రాల ఖర్చుల ఆధారంగా విధానం ఉండాలని సీఎం వీడీ సతీశన్‌‌ కోరారు.