- వారంలోగా వివరణ ఇవ్వాలని ఇంటర్ విద్యాశాఖ డెడ్ లైన్
హైదరాబాద్, వెలుగు: నకిలీ సర్టిఫికెట్లతో సర్కారు కొలువు కొట్టేసిన జూనియర్ లెక్చరర్ల (జేఎల్) మెడకు ఉచ్చు బిగుస్తోంది. ఇతర రాష్ట్రాలకు చెందిన నకిలీ పీజీ పట్టాలతో ఉద్యోగాలు సంపాదించిన 36 మంది జూనియర్ లెక్చరర్లకు ఇంటర్ విద్యాశాఖ మరోసారి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లోగా తమ నోటీసులకు తగిన వివరణ ఇవ్వాలని హెచ్చరించింది. అయితే, నిజానికి ఈ 36 మంది జూనియర్ లెక్చరర్లకు రెండు వారాల క్రితమే ఇంటర్ విద్యాశాఖ నోటీసులు ఇచ్చింది.
అయితే, అధికారులచ్చిన నోటీసుల్లోని కొన్ని చిన్న చిన్న టెక్నికల్ పదాలను అడ్డం పెట్టుకొని వీరిలో 20 మంది హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన కోర్టు.. నోటీసుల్లో ఉన్న లోపాలను సరిదిద్ది, నిబంధనల ప్రకారం మరోసారి నోటీసులు ఇచ్చేందుకు అధికారులకు అవకాశం ఇచ్చింది. దీంతో స్పందించిన అధికారులు, హైకోర్టు సూచనల మేరకు పక్కాగా మరోసారి షోకాజ్ నోటీసులు సిద్ధం చేసి వారికి అందించారు.
అయితే, ఉద్యోగాల్లో చేరే సమయంలో వీరు సమర్పించిన పీజీ సర్టిఫికెట్లు ఇతర రాష్ట్రాల యూనివర్సిటీలకు చెందినవిగా అధికారులు గుర్తించారు. దీనిపై లోతుగా విచారణ జరపగా, ఆ పట్టాలన్నీ ఫేక్ అని తేలింది. వారం రోజుల్లో వీరు ఇచ్చే వివరణ ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని ఉన్నతాధికారులు తెలిపారు. ఒకవేళ వివరణ సంతృప్తికరంగా లేకపోయినా, లేదా గడువులోగా స్పందించకపోయినా వారిని ఉద్యోగాల నుంచి తొలగించే అవకాశం ఉంది. నకిలీ సర్టిఫికెట్లతో ఇన్నాళ్లూ ప్రభుత్వ ఖజానా నుంచి జీతాలు పొందిన వీరిపై క్రిమినల్ కేసులు పెట్టే ఆలోచనలో కూడా అధికారులు ఉన్నట్లు సమాచారం.
