- లక్షకు పైగా వితంతు, 41 వేలకు పైగా దివ్యాంగుల అర్జీలు
- అప్లికేషన్లలో టాప్ లో హైదరాబాద్, మేడ్చల్, నల్గొండ జిల్లాలు
- అత్యల్పంగా ములుగు జిల్లా
- దరఖాస్తులకు ఈ నెల 31 దాకా గడువు
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో కొత్త ‘చేయూత’ పింఛన్ల కోసం దరఖాస్తులు వెల్లువెత్తాయి. ప్రభుత్వం అందిస్తున్న ఏడు రకాల పింఛన్లను పొందేందుకు ప్రజలు భారీ సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 1,61,752 కొత్త అప్లికేషన్లు వచ్చాయి. పింఛన్ల కోసం అప్లై చేసుకునేందుకు ఈ నెల 31 వరకు అవకాశం ఉండడడంతో అప్లికేషన్లు మరిన్ని వచ్చే అవకాశం ఉందని ఆఫీసర్లు చెబుతున్నారు.
ఎక్కువగా వితంతు, దివ్యాంగ అప్లికేషన్లే..
పింఛన్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు వచ్చిన మొత్తం అప్లికేషన్లలో వితంతు, దివ్యాంగుల పింఛన్ల దరఖాస్తులే ఎక్కువగా ఉన్నాయి. మొత్తం వచ్చిన అప్లికేషన్లలో 67 శాతానికిపైగా వితంతు పింఛన్ల కోసమే వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా 1,08,571 మంది వితంతు మహిళలు పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆ తర్వాతి స్థానంలో దివ్యాంగులు ఉండగా, వీరి నుంచి 41,256 దరఖాస్తులు వచ్చాయి. కులవృత్తులు, ప్రత్యేక కేటగిరీలకు సంబంధించి.. గీత కార్మికుల నుంచి 5,726, ఒంటరి మహిళల నుంచి 3,939, చేనేత కార్మికుల నుంచి 2,260 దరఖాస్తులు వచ్చాయి.
హైదరాబాద్, మేడ్చల్‌లోనే అత్యధికం
జనాభా అధికంగా ఉన్న గ్రేటర్ పరిధిలోని జిల్లాల్లో పింఛన్ల కోసం అత్యధికంగా దరఖాస్తులు వచ్చాయి. హైదరాబాద్ జిల్లా 9,568 దరఖాస్తులతో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలవగా.. మేడ్చల్-మల్కాజిగిరి 9,426 దరఖాస్తులతో రెండో స్థానంలో ఉంది. ఆ తర్వాత నల్గొండ జిల్లాలో 8,361 దరఖాస్తులు రాగా రంగారెడ్డిలో 7,510, మెదక్ లో 7,400, కరీంనగర్ జిల్లాలో 6,720 దరఖాస్తులు వచ్చాయి. మరోవైపు అత్యల్పంగా ములుగు జిల్లా నుంచి కేవలం 1,505 దరఖాస్తులు మాత్రమే అందాయి.
వనపర్తి జిల్లాలో 1,829, జయశంకర్ భూపాలపల్లిలో 1,933 , నిర్మల్ జిల్లాలో 1,974 అప్లికేషన్లు అందాయి. ఇక, చేనేత పింఛన్లకు సంబంధించి జగిత్యాల జిల్లాలో 580, యాదాద్రి భువనగిరి జిల్లాలో 235, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 206 అప్లికేషన్లు వచ్చాయి. గీత కార్మికులకు సంబంధించి నల్గొండలో 561, జగిత్యాలలో 527, సూర్యాపేట జిల్లాలో 491 మంది అప్లై చేసుకున్నారు. ఒంటరి మహిళలు పింఛన్ల కోసం హైదరాబాద్ జిల్లాలో 878, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో 399 అప్లికేషన్లు వచ్చాయి.
అప్లికేషన్ల వివరాలు
- వితంతువులు 1,08,571
- దివ్యాంగులు 41,256
- గీత కార్మికులు 5,726
- ఒంటరి మహిళలు 3,939
- చేనేత కార్మికులు 2,260
- మొత్తం దరఖాస్తులు 1,61,752
