రంగారెడ్డి జిల్లాలో కోట్ల విలువైన ప్రభుత్వ భూమి మాయం..తహసీల్దార్కు తెలియకుండానే ప్రభుత్వ రికార్డుల్లో మార్పు

రంగారెడ్డి జిల్లాలో కోట్ల విలువైన ప్రభుత్వ భూమి మాయం..తహసీల్దార్కు తెలియకుండానే ప్రభుత్వ రికార్డుల్లో మార్పు
  • ఓ మహిళ పేరుపై నమోదు    
  • భు-భారతిలో అక్రమాలు!
  • నిందితురాలిపై కేసు

ఇబ్రహీంపట్నం, వెలుగు: రూ.కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ఆన్‌‌‌‌లైన్ పోర్టల్‌‌‌‌లో అక్రమంగా ప్రైవేట్ వ్యక్తి పేరిట నమోదు చేసిన వ్యవహారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇబ్రహీంపట్నం మండల తహసీల్దార్ బి.సునీత వివరాల ప్రకారం.. మంగళ్​పల్లి గ్రామంలోని సర్వే నంబర్ 96లో ఉన్న 4.34 ఎకరాల భూమి 1960-–61, 1961–62 నాటి పహానీల ప్రకారం పొరంబోకు భూమిగా నమోదై ఉంది. 

ఆన్‌‌‌‌లైన్ ధరణి, భూ-భారతి పోర్టల్‌‌‌‌లోనూ నోషనల్ ఖాతా కింద ప్రభుత్వ భూమిగానే చూపిస్తోంది. ఇండియన్ స్టాంప్ యాక్ట్, 1908లోని సెక్షన్ 22-A ప్రకారం ఈ భూమి నిషేధిత ఆస్తుల జాబితాలో ఉంది. ఇటీవల భూ-భారతి పోర్టల్‌‌‌‌ను పరిశీలించగా ఆ భూమి వహీదా బేగం అనే 45 ఏళ్ల మహిళ పేరిట అక్రమంగా నమోదు చేసినట్లు తేలింది. 

అధికారిక ఉత్తర్వులు, ఆధారాలు లేకుండానే ఈ ఏడాది ఆగస్టు 6న పట్టాదారు పాస్‌‌‌‌బుక్​ను కూడా జనరేట్ చేసి డిజిటల్ సంతకం కూడా ఉంది. విషయాన్ని గుర్తించిన తహసీల్దార్ సునీత అక్టోబర్ 1న ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌‌‌‌లో ఫిర్యాదు చేశారు. దీంతో నిందితురాలు వహీదా బేగంపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎమ్మార్వోకు తెలియకుండానే ప్రభుత్వ భూమి రికార్డులు మార్పు జరగడం అనుమానాలకు తావిస్తోంది.