- ఆయా నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులపై రైల్వే అధికారుల ప్రజెంటేషన్
- పనుల్లో జాప్యంపై అధికారుల నిలదీత
- సమావేశానికి హాజరైన తెలంగాణ, ఏపీ, కర్నాటక రాష్ట్రాల ఎంపీలు
హైదరాబాద్‌సిటీ, వెలుగు: తమ నియోజకవర్గాల్లో దక్షిణ మధ్య రైల్వే చేపట్టిన అభివృద్ధి పనులు, పెండింగ్ప్రాజెక్టుల్లో స్పీడ్పెంచాలని దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్కుమార్శ్రీవాస్తవకు ఎంపీలు సూచించారు. నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేయాలని కోరారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోకి వచ్చే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక రాష్ట్రాలకు చెందిన ఎంపీలతో రైల్వే జీఎం సంజయ్కుమార్శ్రీవాస్తవ ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
గురువారం సికింద్రాబాద్ రైల్‌నిలయంలో జరిగిన ఈ సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, గడ్డం వంశీకృష్ణ, వద్దిరాజు రవిచంద్ర, మండాడి అనిల్ కుమార్ యాదవ్, ఈటల రాజేందర్, రఘునందన్ రావు, కడియం కావ్య, కుందూరు రఘువీర్, ఆర్ రఘురామ్ రెడ్డి, సురేశ్ షెట్కార్, బలరాం నాయక్, జి.నగేష్, డీకే అరుణ, బస్తిపాటి నాగరాజు, కేశినేని శివనాథ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తమ నియోజకవర్గాల్లోని అభివృద్ధి పనులు, సేవలకు సంబంధించిన సమస్యలను రైల్వే జీఎం దృష్టికి తీసుకెళ్లారు. రోడ్డు అండర్ బ్రిడ్జీలు, రోడ్డు ఓవర్ బ్రిడ్జీలు, కొత్త రైల్వే లైన్ల నిర్మాణం, కొత్త రైళ్లను ప్రవేశపెట్టడం, ప్రస్తుతం ఉన్న రైళ్లకు అదనపు స్టాపేజీలను ఏర్పాటు చేయడం, రైళ్లను పొడిగించడంతో పాటు ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కోరారు. అలాగే, కొత్త పనులు,సేవలకు సంబంధించిన ప్రతిపాదనలను రూపొందించేటప్పుడు ఎంపీల సూచనలు, అభిప్రాయాలు తీసుకోవాలన్నారు. కాగా, ఎంపీల సూచనలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామని, వాటి అమలుకు అన్ని విధాలా కృషి చేస్తామని జీఎం ఎంపీలకు హామీ ఇచ్చారు.
2 వేల కోట్లతో 40 రైల్వే స్టేషన్ల అధునీకరణ
దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని ప్రాజెక్టులు, ప్రయాణికుల సేవలు, సరుకు రవాణా, మౌలిక సదుపాయాల అభివృద్ధికి సంబంధించి సంజయ్ కుమార్ శ్రీవాస్తవ ప్రజెంటేషన్ ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది జూన్ నుంచి దక్షిణ మధ్య రైల్వే పరిధిలో సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్ డివిజన్లు మాత్రమే కొనసాగుతున్నాయని తెలిపారు. తెలంగాణాలోని 40 రైల్వే స్టేషన్లను రూ. 2 వేల కోట్లకు పైగా వ్యయంతో ఆధునీకరిస్తున్నట్టు తెలిపారు. హైటెక్ సిటీ, బేగంపేట, కరీంనగర్, వరంగల్ స్టేషన్లు సహా నాలుగు ‘అమృత్ స్టేషన్లు’ ఇప్పటికే ప్రారంభం అయ్యాయని, మిగిలిన స్టేషన్లలో పనులు వేగంగా కొనసాగుతున్నాయని వివరించారు.
రూ. 24,210.179 కోట్ల వ్యయంతో 1,481 కిలోమీటర్ల న్యూ లైన్, డబ్లింగ్, ట్రిప్లింగ్ ప్రాజెక్టులు ప్రస్తుతం పురోగతిలో ఉన్నాయని తెలిపారు. 2025 ఏప్రిల్‌నుంచి 4 జతల కొత్త రైళ్లు, 5 జతల అమృత్ భారత్ రైళ్లను ప్రవేశపెట్టామని.. 14 రైళ్లను వివిధ టెర్మినళ్లకు పొడిగించామని, 56 రైళ్లకు వివిధ స్టేషన్లలో స్టాపేజీలను కల్పించామని వివరించారు. ఈ సంవత్సరంలో 30 జతల రైళ్లను రెగ్యులర్ సర్వీసులుగా క్రమబద్ధీకరించినట్టు జీఎం తెలిపారు. దక్షిణ మధ్య రైల్వే అదనపు జీఎం సత్య ప్రకాశ్, వివిధ శాఖల ఉన్నతాధికారులు సమావేశానికి హాజరయ్యారు.
వెయ్యి కోట్ల నిధులు మంజూరైనా పనులు జరగడం లేదు
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో పెద్దపల్లి నియోజకవర్గం పరిధిలో ఎలాంటి రైల్వే ప్రాజెక్టుల అభివృద్ధి జరగలేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండేండ్లలో రూ.వెయ్యి కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులను తీసుకువచ్చాం. అయితే, పనులు మాత్రం ప్రారంభించడం లేదు. ఇదే విషయాన్ని ఈ సమావేశంలో అడిగి పనుల పురోగతిని రైల్వే అధికారులను అడిగి తెలుసుకున్నాం. కలెక్టర్ల వద్ద భూసేకరణ పనులు పెండింగ్‌లో ఉన్నాయని అధికారులు తెలిపారు.
మా నియోజకవర్గ అభివృద్ధికి అధికారులు సహకరించి, ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టుల అభివృద్ధికి కృషి చేయాలని కోరాను. సింగరేణి, ఇండస్ట్రియల్ కోల్ బెల్ట్ ప్రాంతాలు కావడంతో పెద్దపల్లి నియోజకవర్గం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలని కోరాను. రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేయాలని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌తో పాటు రైల్వే ఉన్నతాధికారులకు పలు మార్లు రిప్రజెంటేషన్లు ఇచ్చిన విషయాన్ని కూడా జీఎం దృష్టికి తీసుకెళ్లా. పలు ప్యాసింజర్ రైళ్లకు కొత్త స్టాపేజీలు కల్పించాలని, కరోనా సమయంలో నిలిపివేసిన రైల్వే స్టేషన్ల స్టాపేజీలను పునరుద్ధరించాలని, భగత్‌సింగ్, తిరుపతి వంటి రైళ్లకు మంథని, రామగిరి ప్రాంతాల్లో స్టాపేజీలు కల్పించాలని రిప్రజెంటేషన్ ఇచ్చాను.
