ఎస్సీ ఉపకులాలకు తహసీల్దార్ల ద్వారానే సర్టిఫికెట్లు ఇవ్వాలి : ఎంబీఎస్సీ ఉపకులాల సమితి

ఎస్సీ ఉపకులాలకు తహసీల్దార్ల ద్వారానే సర్టిఫికెట్లు ఇవ్వాలి :  ఎంబీఎస్సీ ఉపకులాల సమితి
  •     మంత్రి అడ్లూరికి ఎంబీఎస్సీ ఉపకులాల సమితి వినతి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని 57 ఎస్సీ ఉపకులాలకు తహసీల్దార్ల ద్వారానే క్యాస్ట్, ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తదితర సర్టిఫికెట్లు జారీ అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఎంబీఎస్సీ ఉపకులాల సమితి డిమాండ్ చేసింది. ఈ మేరకు గురువారం సమితి జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు బైరి వెంకటేశం ఆధ్వర్యంలో నాయకులు ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కలసి వినతిపత్రం సమర్పించారు. ఈ సమస్యపై వెంటనే స్పందించి తగిన ఉత్తర్వులు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఎస్సీ వర్గంలో ఉన్న మాల, మాదిగ కులాలతో పాటు 160 కులాలు ఉన్న బీసీలకు, 32 తెగలు ఉన్న ఎస్టీలకు, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు తహసీల్దార్లే కుల ధ్రువీకరణ పత్రాలు ఇస్తున్నారని బైరి వెంకటేశం గుర్తుచేశారు. కానీ ఎస్సీ ఉపకులాలకు మాత్రం కలెక్టర్లు, ఆర్డీవోల ద్వారా సర్టిఫికెట్లు జారీ చేయడంలోని అంతరార్థం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఈ నిబంధనల వల్ల సర్టిఫికెట్ల కోసం ఉపకులాల ప్రజలు ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తోందని, పిల్లలు విద్యకు దూరమవుతూ వివక్షకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

కుల ధ్రువీకరణ పత్రాల జారీ తమ కనీస ఆత్మగౌరవ సమస్య అని, దీనికి శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు 57 ఎంబీఎస్సీ కులాలకు వెంటనే ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని నాయకులు కోరారు.  నాయకుల సమస్యలపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సానుకూలంగా స్పందించారు. ఎస్సీ ఉపకులాల సమస్యను వెంటనే సీఎం దృష్టికి తీసుకెళ్లి, తగిన పరిష్కారం అయ్యేలా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు.